- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం నేషనల్ లెవెల్ స్కాం.. కాగ్‌కు YS షర్మిల ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఇప్పటికే సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఫిర్యాదు చేసింది. శుక్రవారం కాగ్ డైరెక్టర్ గిరీష్ చంద్ర ముర్మును కలిసిన షర్మిల కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేసి కీలక డాక్యూమెంట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి స్టేట్ లెవెల్ స్కాం కాదని ఇది నేషనల్ లెవెల్‌లో జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 38 వేల కోట్లతో పూర్తిచేసి 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సంకల్పిస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వ్యయం లక్షా 20 వేల కోట్లకు పెంచారని అన్నారు. ప్రాజెక్టు కాస్ట్‌ను మూడింతలు పెంచినా ఆయకట్టు కేవలం రెండు లక్షల ఎకరాలు మాత్రమే పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి దశలో అవినీతి చోటు చేసుకుందని ప్రతి ప్యాకేజీలోనూ కుంభకోణం ఉందన్నారు. నాన్ ఎన్ ప్యానెల్ కంపెనీలకు కాంట్రాకులు అప్పగించారని, బీహెచ్ఈఎల్ నుంచి మోటర్లు కొన్న ధరకు ప్రభుత్వం చూపించిన ధరకు భారీ వ్యత్యాసం ఉందని ఆరోపించారు.
విచారణకు కాగ్ హామీ:
తమ ఫిర్యాదుపై ఇండిపెండెంట్‌గా ఇన్వెస్టిగేషన్ చేపడతామని కాగ్ హామీ ఇచ్చినట్లు షర్మిల తెలిపారు. ప్రత్యేక బృందాన్ని నియమించి అడిటర్స్‌తో పాటు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్‌తో దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అవినీతి జరిగిందని ఎవరో ఒకరు ఫిర్యాదు చేయకపోతే దర్యాప్తు ఎలా చేస్తారనే ఉద్దేశంతోనే తాను దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నట్టు చెప్పారు. తన ఫిర్యాదుతో ఎక్కడ అవినీతి జరిగిందో కనిపెడతామని హామీ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మొత్తం బ్యాంకుల నుంచి లక్ష కోట్లు అప్పులు తీసుకొచ్చారని అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.30 వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ నుంచి మరో రూ.30 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ.12 వేల కోట్లు అప్పు తెచ్చారని ఇది జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం అని దీనిపై దర్యాప్తు జరగాలన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథతో పాటు తెలంగాణలోని ప్రతి పని, ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ హస్తం ఉందని, రాష్ట్రంలో ఆడిట్ శాఖకు మంత్రిగా కేసీఆర్ ఉన్నారని చెప్పారు. మేఘా కంపెనీకే కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. కాగ్ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుపై కూడా ఆడిట్ చేయొచ్చని అందువల్ల ఫిర్యాదు చేశామని అన్నారు. సీబీఐకి కూడా గతంలో ఫిర్యాదు చేశామని అయితే సీబీఐను రాష్ట్రంలోకి రానివ్వకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నిక బైకాట్ చేయాలి:
మునుగోడు ఉప ఎన్నిక స్వార్థం కోసం వచ్చిందని ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కాదని షర్మిల అన్నారు. మునుగోడులో పరిస్థితులు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికను వైఎస్సార్ టీపీ తరపున బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నామని చెప్పారు. మునుగోడు బరిలో వైఎస్సార్ టీపీ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి దించలేదు.
వివేకా హత్య ఎవరు చేసినా కఠిన శిక్ష పడాలి:
తన బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసుపై మరోసారి షర్మిల స్పందించారు. ఈ ఘటన మా కుటుంబంలో జరిగిన ఘోరమైన సంఘటన అని అన్నారు. హత్య చేసినది ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వివేకా హంతకులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. కాగా, వివేకా కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏపీలో విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మరో రాష్ట్రానికి విచారణ బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు సుప్రీంకోర్టు నిర్ణయం వెల్లడించింది. ఈ క్రమంలో షర్మిల రియాక్ట్ కావడం ఆసక్తిగా మారింది.