'కేసీఆర్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాల సంగతేంటి?'

by GSrikanth |
కేసీఆర్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాల సంగతేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె తాను విధానపరంగా విమర్శించానని ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా తన ప్రసంగాలు కొనసాగుతాయన్నారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే మౌనంగా ఉన్న ఎమ్మెల్యేలు, తమపై విమర్శలు రాగానే స్పందిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే సీఎంను విమర్శించినా పర్వాలేదు అన్నట్లుగా ఉందని సీఎంను విమర్శిస్తే వీరికి ఓకేనా అని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే తాను ఘాటుగా రియాక్ట్ కావాల్సి వచ్చిందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్థానిక నేతలకు చిత్తశుద్ధి లేదని అందువల్లే ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, సీఎం కేసీఆర్, మంత్రులపై షర్మిల నిరాధారమైన ఆరోపణలతో పాటు శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. షర్మిలపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు. దీనిపై ఇవాళ సభాహక్కుల ఉల్లంఘన కమిటీ సమావేశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు షర్మిలపై ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డి డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదు వెళ్లిన వెంటనే షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై చర్యల గురించి ఆలోచించే ముందు సీఎం కేసీఆర్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు చూసి విని ఆయనపై తొలుత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏ పనినైనా నిష్టగా చేసే ప్రతి మహిళను, నిరుద్యోగులను కించపరిచిన మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరిణామాలతో తెలంగాణలో టీఆర్ఎస్, వైఎస్సార్ టీపీ మధ్య రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed