Metro Parking : ‘మెట్రో’ ఉచిత పార్కింగ్ కల్పించాల్సిందే.. యువజన సంఘాల డిమాండ్

by Ramesh N |
Metro Parking : ‘మెట్రో’  ఉచిత పార్కింగ్ కల్పించాల్సిందే.. యువజన సంఘాల డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కొనసాగించాలని ఎండీకి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. మెట్రో పార్కింగ్ చార్జీలు వసూళ్లు చేయడం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, పీవైఎల్ రాష్ట్ర నేత బి.కృష్ణ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌లు డిమాండ్ చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఎల్‌అండ్‌టి సంస్థ పార్కింగ్ స్థలంలో సౌకర్యాలు కల్పించకుండా పేయిడ్ చార్జీలు వసూళ్లకు వ్యతిరేకంగా యువజన సంఘాలు, మెట్రో ప్రయాణికులు సంయుక్తంగా నాగోల్ మెట్రో‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎల్అండ్‌టీ సంస్థదే అని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని, వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా, ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ చార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు.

ప్రయాణికుడు అప్పటికే వందల రూపాయలు చార్జీలు మెట్రో ట్రైన్ కి చెల్లిస్తున్నారని, మళ్లీ పార్కింగ్ పేరుతో వసూలు చేయడం, అది కూడా రవాణా చార్జీలతో సమానంగా, అధిక మొత్తంలో వసూలు చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే నాగోల్, మియాపూర్, మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షానికే నాగోల్ మెట్రో పార్కింగ్ స్థలంలో చిత్తడిగా మారిందని, అదేవిధంగా ప్రయాణికుల వాహనాలకు ఎటువంటి రక్షణ లేదని వారు విమర్శించారు. దీనిపై సంస్థ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాలు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఎల్అండ్‌టీ సంస్థ పరిధిలోగల అనుబంధ సంస్థ అయిన ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ ద్వారా మెట్రో రైల్ సౌకర్యాల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూస్తున్నదని వారు అన్నారు. అయితే మెట్రో సంస్థ ఎల్‌అండ్‌టీ సంస్థకు 30 ఏళ్ళ లీజు అగ్రిమెంట్ ఇచ్చిందని, నిబంధనలకు లోబడే నిర్వహణ విషయంలో ఎల్‌అండ్‌టీ వ్యవహరించాలన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఛార్జీలను వసూళ్లు చేస్తున్నదని వారు ఆరోపించారు.

Advertisement

Next Story