Yadadri: యాదాద్రి గోపురానికి బంగారు తాపడం.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-10-18 13:39:24.0  )
Yadadri: యాదాద్రి గోపురానికి బంగారు తాపడం.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపిన ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయంలో భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతంలో గుట్టపై మంచి నీటి సౌకర్యం సరిగ్గా లేదని తెలిసి, 14 చోట్ల డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశామని, అలాగే టాయిలెట్ల సమస్య కూడా ఉందని ఫిర్యాదులు రావడంతో.. గుట్టపై 47 టాయిలెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక భక్తుల కోసం విష్ణు పుష్కరిణి, గిరి ప్రదక్షిణ చేసేందుకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం నిర్మించామని అన్నారు. ప్రసాదాల కౌంటర్ల ను పెంచడమే గాక ఆన్లైన్ లో ప్రసాదాలు ఆర్డర్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. అలాగే యాదాద్రి గోపురానికి బంగారు తాపడం చేయించాలని జీవో జారీ చేయడం జరిగిందని, ఈ పనులు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల లోపు పూర్తి కావాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనికోసం ఇప్పటికే 60 కిలోల బంగారం అందుబాటులో ఉంచామని, భక్తుల ఎవరైనా విరాళాలు ఇవ్వాలని అనుకుంటే ఆన్లైన్ సదుపాయం ద్వారా ఇవ్వచ్చని సూచించారు.

ఇక తిరుపతి లడ్డూ ఘటన తర్వాత రాష్ట్రంలోని అన్ని లడ్డూల సాంపిళ్లను టెస్ట్ చేయించామని, ఎక్కడా కల్తీ లేదని, అన్నీ మంచి రిపోర్టులు వచ్చాయని చెప్పారు. భద్రాచలం ఆలయ ఆవరణ స్థలం తక్కువగా ఉన్నదని, దానిని పెంచి ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దీని కోసం ప్రణాళికలు చేస్తున్నామని, ఆలయాల అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. గతంలో ఆలయాల కింద దేవుని మాన్యం పేరుతో భూములు ఉండేవని, ప్రస్తుతం వాటిల్లో చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయని చెప్పారు. అన్ని గ్రామాల్లో ఆలయ భూములను గుర్తించి వాటిని వెంటనే ప్రభుత్వ కంట్రోల్ లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇక ముందు అలాంటి భూములు కబ్జాలకు గురి కాకుండా అందులో సోలార్ ప్లాంట్లు లేదా పామాయిల్ తోటలు ఏర్పాటు చేసి ఆలయాలకు రెవెన్యూ పెంచాలని చెప్పారు. ఒకవేళ వాటిల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకొని ఉంటే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారిని ఖాళీ చేయించి, వారికి వేరే దగ్గర స్థలం చూపించి ఇళ్లు నిర్మించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు కొండా సురేఖ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed