భూ సమస్యల పరిష్కారానికి యాచారం పాలసీ బెస్ట్

by Shiva |
భూ సమస్యల పరిష్కారానికి యాచారం పాలసీ బెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో అప్లయ్ చేసుకున్నా.. తిరస్కరణలే ఎదురవుతున్నాయి. దాంతో మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకుంటుండటంతో డ్యాష్ బోర్డులో సంఖ్య పెరిగిపోతున్నది. అయితే భూమి సునీల్ ఆధ్వర్యంలో లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ (లీఫ్స్) రంగారెడ్డి జిల్లా యాచారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 10 గ్రామాల్లో భూ సమస్యలపై అధ్యయనం చేసింది. లీఫ్స్ న్యాయవాదుల బృందం మకాం వేసి అప్లికేషన్లు స్వీకరించింది. వారి సమస్యలను స్టడీ చేసింది. వాటి పరిష్కారానికి మార్గాలను వెతికింది. ప్రతి దరఖాస్తుకూ రిపోర్టును సిద్ధం చేసింది.

ఐదు నెలల పాటు చేసిన అధ్యయనం సోమవారంతో ముగియగా, ధరణి గుర్తించని అనేక సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నట్టు గుర్తించింది. ఇందులో భూ సమస్యలను ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్ ద్వారా తీసుకున్నారు. ఒక్కో అప్లికేషన్‌ను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పొరపాట్లు, సమస్యలు, పరిష్కార మార్గాలను రూపొందించారు. 12 రకాలుగా కేటగిరీ చేసిన అప్లికేషన్ ఫారం ద్వారా అనేక కేస్ స్టడీస్‌ను అధ్యయనం చేశారు. పైలెట్ ప్రాజెక్టును రెండు దశలుగా పూర్తి చేశారు. మొదట అప్లికేషన్ల స్వీకరణ, రెండోది వారి దగ్గరున్న డాక్యుమెంట్ల ఆధారంగా రిపోర్ట్ తయారు చేయడం.

ఈ రెండు దశలు పూర్తయినట్టు ధరణి కమిటీ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ ప్రకటించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంథని గౌరెల్లిలో పైలెట్ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇన్ని రోజులుగా లీఫ్స్ బృందం చేసిన కృషిని మీడియాకు వివరించారు. ఇక మూడు, నాలుగో దశలు మిగిలి ఉన్నాయన్నారు. ఇక్కడ గుర్తించిన ప్రతి సమస్యకూ తగిన రిపోర్టును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించనున్నట్టు చెప్పారు. వాటిని రెవెన్యూ యంత్రాంగం ద్వారా అమలయ్యేటట్టు ప్రయత్నిస్తామన్నారు.-

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి

యాచారం మండలంలోని పది గ్రామాల్లో తాము చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపిస్తున్నట్టు భూమి సునీల్ తెలిపారు. ధరణి మాడ్యూళ్ల ద్వారా అప్లయ్ చేసుకోవడం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రతి గ్రామంలోనూ రెండు రకాలుగా సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయని వెల్లడించారు. తాము చేపట్టినట్లుగా గ్రామంలో శిబిరం ద్వారా అప్లికేషన్లు స్వీకరించి, రిపోర్టులు రూపొందించవచ్చని చెప్పారు. వందకు వంద శాతం సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే ఇంటింటికీ వెళ్లి వారి భూ రికార్డులను పరిశీలించాలని, వారి దగ్గరున్న డాక్యుమెంట్లకు, రెవెన్యూ రికార్డులకు మధ్య ఎంత తేడా ఉన్నదో చూడాలని సూచించారు.

సమస్యలకు వెను వెంటనే పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ప్రతి ఇంటికీ వైద్య పరీక్షల మాదిరిగా రెవెన్యూ రికార్డుల పరీక్షలు చేపట్టాలని వెల్లడించారు. 2016లో తాము వరంగల్‌లో ఇంటింటికీ వెళ్లి ఇలాగే పరీక్ష చేస్తే ఆరు గ్రామాల్లోని పహానీలు, 1బీ రికార్డుల్లో 12 వేల తప్పులు గుర్తించామని చెప్పారు. అప్పటికప్పుడు మార్క్ చేయడం ద్వారా పరిష్కరించినట్టు తెలిపారు. అలా చేయడం ద్వారా ప్రతి రైతుకూ న్యాయం జరుగుతుందన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశం ఉందన్నారు.

అంతటా చేపట్టేందుకు మార్గమిదే

2003–05 మధ్య కాలంలో భూమి సునీల్ ఆధ్వర్యంలో అసైన్డ్ ల్యాండ్స్ పైనా డీఆర్డీఏ సహకారంతో స్టడీ చేశారు. ప్రజల భాగస్వామ్యం కమ్యూనిటీ కో ఆర్డినేటర్లను వినియోగించారు. అలాగే 2012–13 కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 9 మండలాల్లో గిరి ప్రగతి, గిరి న్యాయం అనే ప్రోగ్రాంను డిజైన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ల్యాండ్ సర్వేను కూడా పూర్తి చేశారు. సెర్ప్‌లో పని చేస్తున్న కో ఆర్డినేటర్లు, పారా లీగల్స్ సేవలతో సక్సెస్ అయ్యారు. ఈ అధ్యయనాలకు కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్ ప్రశంసలు దక్కాయి. రాష్ట్రంలో శిక్షణ పొందిన 110 మంది కమ్యూనిటీ సర్వేయర్లు, 133 మంది పారా లీగల్స్, ఆరుగురు లీగల్ కో ఆర్డినేటర్లు ఉన్నారు. వీరంతా భూ సమస్యలపైన పని చేశారు.

గతంలో మండల సమాఖ్యలు కూడా భూమి ఎజెండాగా పని చేశాయి. అప్పటి కేంద్ర మంత్రి జై రాం రమేశ్ ఆధ్వర్యంలో కడప, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు పైలెట్ ప్రాజెక్టులు నడిచాయి. వాటి ఆధారంగానే రైతు సదస్సులు చేపట్టి 12 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. ప్రభుత్వం కూడా వీరి సేవలను సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు దక్కుతాయన్న అభిప్రాయం ఉన్నది. పైగా ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి రాబట్టేందుకు చాన్స్ ఉన్నట్టు సునీల్ వివరించారు. భూ న్యాయ శిబిరం ముగింపు కార్యక్రమంలో ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండ రెడ్డి, లీఫ్స్ సంస్థ ప్రతినిధులు జి.జీవన్‌రెడ్డి, కొంపెల్లి మల్లేశ్, వి.ప్రవీణ్, ఈరుగు రవి పాల్గొన్నారు.

భూమి హక్కుల పరీక్ష చేశాం: ప్రొ.ఎం.సునీల్ కుమార్, లీఫ్స్ అధ్యక్షుడు

యాచారం మండలంలోని పది గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టును పూర్తి చేశాం. ఇక్కడి రైతుల భూమి హక్కుల పరీక్ష చేశాం. సమస్య ఏమిటో గుర్తించి పరిష్కారం ఎలా అనే రిపోర్ట్ కూడా సిద్ధం చేశాం. ఏ విధంగా సమస్య పరిష్కరించుకోవాలో రైతులకు వివరిస్తాం. ఇదంతా ఉచితంగానే చేశాం. మా టీం సభ్యులు మండలంలోని 10 గ్రామాల్లో మకాం వేసి దరఖాస్తులు స్వీకరించి స్టడీ చేశారు.

ఈ పది గ్రామాల నుంచి ధరణి మాడ్యూళ్ల ద్వారా 900 అప్లికేషన్లు వస్తే తాము నిర్వహించిన భూ న్యాయ శిబిరాల ద్వారా 2,250 వరకు వచ్చాయి. దీన్ని బట్టి ఇంకా అప్లయ్ చేసుకోని వారు చాలా మంది ఉన్నట్టే. వీటన్నింటికీ రిపోర్టులు తయారు చేశాం. ఇక్కడ తాము అనుసరించిన విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా భూ సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఈ మార్గాలనే ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయాలని కోరుతాం.

Advertisement

Next Story