‘లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలో చాలా మార్పులు’.. ఎంపీ ఎన్నికల వేళ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
‘లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలో చాలా మార్పులు’.. ఎంపీ ఎన్నికల వేళ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాల మాట పక్కన పెడితే సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో జరగబోయే పరిణామాలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని, రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే కూలిపోబోతున్నదని బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు తరచూ వ్యాఖ్యలు చేస్తుండటం ఈ సస్పెన్స్ కు కారణం అవుతోంది. ఈ క్రమంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్, మోడీ కలిసి కుట్ర పన్నుతున్నారని రేవంత్ రెడ్డి రివర్స్ ఎటాక్ ప్రారంభించగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.

రాసిపెట్టుకోండి.. అనుకున్న దానికంటే ముందే అధికారం:

మంగళవారం అలాంపూర్ లో నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి మీరు అనుకున్న దానికంటే ముందే అధికారం వచ్చి తీరుతుంది. ఇది రాసిపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారాయి. ఓ వైపు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే ఆ మాటలను నిజం చేసేలా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని, అనుకున్న దానికంటే ముందే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించడం వెనుక మతలబు ఏంటి అనేచర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతల మాటలను బట్టి చూస్తే లోక్ సభ ఎన్నికలు ముగియగానే రాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు రాబోతున్నదా? అనే చర్చ జోరుగా జరుగుతోంది.

మళ్లీ అవే వ్యాఖ్యలు:

నిజానికి కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రారంభంలోనే బీఆర్ఎస్ లోని కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తించాలని బీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తే వారి నిర్ణయాన్ని కాదని ప్రభుత్వం పడిపోతుందనే వ్యాఖ్యలు ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి భారీ డ్యామేజీ చేస్తుందనే వాదన తెరమీదకు వచ్చింది. దాంతో ఈ విషయంలో కాస్త సైలెంట్ అయిన బీఆర్ఎస్ నేతలు.. సరిగ్గా ఎన్నికల ప్రచారం ఊపులో ఉన్న సమంయలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, అనుకున్న దానికంటే ముందే బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదనే వ్యాఖ్యలు చేస్తుండటం రచ్చగా మారింది. అయితే తెలంగాణలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరాగాల్సి ఉంది. మరి ఏదో గూడుపుఠాణి చేయకుంటే అంతకంటే ముందే బీఆర్ఎస్ అధికారంలోకి ఎలా వస్తుందని? పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ విషయంలో ఇప్పటికే అలర్ట్ గా ఉన్న రేవంత్ రెడ్డి తమ జోలికి వస్తే మాడి మసైపోతారని ఘాటుగా స్పందిస్తుండగా తాజాగా చల్లా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.



Next Story

Most Viewed