- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆమె’కు అందలం అందని ద్రాక్షే.. రాష్ట్రంలో మహిళలకు అడుగడుగునా వివక్షే..!
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించింది. దేశంలోనే ఎక్కడా లేని వినూత్న సంక్షేమ పథకాలను వారి కోసం అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నది. వాటికి ఈ ఉత్సవాల్లో విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నది. కానీ వారి కోసం ప్రకటించిన అనేక వెల్ఫేర్ స్కీమ్‌లకు సకాలంలో నిధులు విడుదల కావడంలేదు.
‘మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగానే చెప్పుకుంటున్నది’ అంటూ విపక్షాలపై నిప్పులు చెరుగుతున్న మంత్రులు ఇతర రాష్ట్రాల్లోని స్కీమ్‌లను అమలుచేసే వాస్తవాన్ని దాచిపెడుతున్నది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినా టికెట్ల కేటాయింపులో మాత్రం ఆ విధానాన్ని పాటించడంలేదు. గడచిన (2018) అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ కేవలం నలుగురికి మాత్రమే పోటీకి అవకాశం కల్పించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకుండానే దాదాపు రెండేండ్లు గడిచిపోయింది. చివరకు హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మహిళ సాధికారత కోసం ‘వీ-హబ్’ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ స్వంతంగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన మహిళపై అధికార పార్టీ ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి.
గతంలో పలువురు మంత్రులపైనా ఇలాంటి విమర్శలే వచ్చాయి. మహిళా అధికారుల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారు. వీటిపై అధికార పార్టీ నేత చూసీ చూడనట్లుగానే వ్యవహరించారు. మహిళల సాధికారత, భద్రత, సంక్షేమం గురించి విస్తృతంగానే పబ్లిసిటీ చేసుకుంటున్నా వివక్ష, వేధింపుల విషయంలో మాత్రం పార్టీ నాయకత్వం సైలెంట్‌గా ఉండిపోయింది.
తొలి క్యాబినెట్‌లో దక్కని చోటు
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొదటి మంత్రివర్గంలో మహిళకు చోటు దక్కలేదు. నాలుగున్నరేళ్ళ పాటు మహిళా మంత్రి లేకుండానే గడిచిపోయింది. విపక్షాల నుంచి సైతం తీవ్ర స్థాయిలోనే విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రిని ప్రతిపక్షాల సభ్యులు నిలదీశారు. ఆ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్ రెండోసారి పవర్‌లోకి వచ్చిన తర్వాత ఇద్దరికి అవకాశం కల్పించారు.
మొత్తం 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో 2014లో అన్ని పార్టీల తరపున కేవలం తొమ్మిది మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలున్నారు. రెండో అసెంబ్లీలో ఆ సంఖ్య ఆరుకు తగ్గిపోయింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ గురించి 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) స్పష్టమైన హామీ ఇచ్చింది. దానికి తగిన నిష్పత్తిలో టికెట్లు ఇవ్వలేదు. రెండోసారి కేవలం నలుగురు మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. ఫస్ట్ టైమ్ ఎంపీగా కల్వకుంట్ల కవిత, సెకండ్ టైమ్ ఎంపీగా మాలోతు కవిత మాత్రమే మహిళలు.
మహిళా కమిషన్ లేకుండా రెండేండ్లు
రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకుండా రెండేండ్లు గడిచిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన మహిళా కమిషన్ 2014లో తెలంగాణ ఏర్పాటుతో రెండు కొత్త రాష్ట్రాలకు విడివిడిగా ఆవిర్భవించాయి. తెలంగాణ మహిళా కమిషన్ పదవీకాలం 2018లో ముగిసింది. కొత్త కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో రేగులపాటి రమ్యారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ 2020 డిసెంబరు 31 డెడ్‌లైన్ పెట్టింది. దీంతో సునీతా లక్ష్మారెడ్డి చైర్‌పర్సన్‌గా కొత్త కమిషన్ ఏర్పాటైంది.
మహిళలపై గులాబీ లీడర్ల కామెంట్లు
అమ్మాయిలను చూడాలంటేనే లాగులు తడవాలి.. గుడ్లు పీకేస్తాం.. అంటూ కేసీఆర్ గతంలో హెచ్చరించారు. కానీ గులాబీ పార్టీ నేతలే మహిళల పట్ల అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఒక మహిళా అధికారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అఫీషియల్ ప్రోగ్రామ్‌లోనే అశ్లీల పదాలతో దూషించారు. మంత్రి నిరంజన్ రెడ్డి సైతం మంగళవారం మరదలు అంటూ మహిళా నేతపై నోరు పారేసుకున్నారు.
ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులపై ఆరిజన్ డెయిరీ మహిళా సీఈఓ రాష్ట్ర పోలీసులకు, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీరెవ్వరిపైనా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోలేదు.
మహిళలపై నేరాల్లో అధికార పార్టీ నేతలు
మహిళలపై నేరాలకు పాల్పడిన ఆరోపణలు అధికార పార్టీ నేతలపై గణనీయంగానే ఉన్నాయి. మైనర్ బాలికను రేప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలతో నిర్మల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షాజిద్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక ఆరోపణలతో సిటీ గులాబీ నేత విజయసింహారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక అంశాల్లో వేధింపుల కారణంగా కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రిమాండ్‌లో భాగంగా జైలుకెళ్ళి వచ్చారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన గులాబీ నేతలపై లైంగిక ఆరోపణలు విస్తృతంగా వచ్చాయి.
కల్యాణలక్ష్మి అమల్లో స్కామ్
మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎవ్వరి నుంచీ డిమాండ్ రాకపోయినా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములను ప్రవేశపెట్టామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. పెళ్ళి సమయంలో ఇవ్వాల్సిన సాయం పిల్లలు పుట్టిన తర్వాత అందుతున్నది. ఈ ఏడాది జూన్ నాటికి వెయ్యి కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ. 1200 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా రూ. 200 మాత్రమే విడుదలైంది.
ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలిగినా విమర్శలను కూడా ప్రభుత్వం మూటగట్టుకున్నది. అప్లికేషన్లను ఆమోదించడానికి తాసీల్దారు మొదలు వీఆర్ఏ వరకు పది వేల రూపాయల చొప్పున కమిషన్ తీసుకుంటున్నారు. పలువురు అధికారులపై చర్యలకు స్వయంగా ప్రధాన కార్యదర్శి 2021 జూన్ 19న ఆదేశాలు ఇచ్చారు. సుమారు రూ. 86 లక్షల మేర ఆదిలాబాద్ ఆర్డీవో పరిధిలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది. మొత్తం 10 జిల్లాల్లోని 43 మంది అధికారులపై కేసులు నమోదయ్యాయి.
’ఆరోగ్యలక్ష్మి’కి సగం నిధులే
గర్భిణీలు, బాలింతలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి స్కీమ్‌కు ఎనిమిదేళ్ళ కాలంలో మొత్తం రూ.2,050 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినా అందులో రూ. 1,150 కోట్లు మాత్రమే విడుదలైంది. సుమారు 36 లక్షల మందికి లబ్ధి చేకూరిందని, వారి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేసినట్లు ప్రగతి నివేదికలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
సకాలంలో నిధులు రిలీజ్ కాకపోవడంతో బాలింతలకు పోషకాహారాన్ని అందించలేకపోయినట్లు పలు జిల్లాల అధికారులు పేర్కొన్నారు. దీని ఫలితంగా తల్లుల్లో, పిల్లల్లో రక్తహీనత లక్షణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. హెల్త్ డిపార్టుమెంటు అధ్యయనంలో ఫోలిక్ యాసిడ్ లోపం వెలుగులోకి వచ్చింది.
‘న్యూట్రిషనల్’ స్కీమ్‌పైనా ఆరోపణలు
మాతా, శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీల్లో పోష్ఠికాహార లోపాన్ని నివారించడానికి కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ స్కీమ్‌ను ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి ప్రవేశపెట్టింది. గర్భం దాల్చింది మొదలు డెలివరీ వరకు రెండు విడతల్లో ఈ కిట్లను అందించడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఖర్జూర, ఐరన్ సిరప్, అర కిలో నెయ్యి తదితరాలను కిట్‌గా అందించడం ఈ స్కీమ్ ఉద్దేశం.
ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 50 కోట్లను కేటాయించింది. కానీ కాంట్రాక్టును ఎమ్మెల్సీ సోదరుడికి అప్పజెప్పినట్లు విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. ఒక్కో కిట్ ఖరీదు రూ. 1400 అవుతున్నా సదరు అధికార పార్టీ సోదరుడికి లబ్ధి చేకూర్చడం కోసం ధరను రూ. 2000కు పెంచిందన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.85 లక్షల మంది గర్భిణులకు ఈ కిట్లను అందించడం ప్రభుత్వ లక్ష్యం.
పబ్‌లలో యువతులపైనా నేరాలు
హైదరాబాద్ సిటీ విశ్వనగరంగా మారుతోందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా పబ్ కల్చర్ కారణంగా యువతులపై నేరాలు పెరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలపైనే ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్‌లో గ్యాంగ్‌రేప్ జరిగినట్లు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగిన దర్యాప్తులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నట్లు తేలింది. ఈ సంచలన ఘటన కొన్ని రోజులు హడావిడి చేసినా ఆ తర్వాత చప్పపడింది. నడుస్తున్న కారులోనే యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తేల్చిన పోలీసులు ఆ కారును రూలింగ్ పార్టీకి చెందిందని పేర్కొన్నారు.
నేరాల్లో హైదరాబాద్ సెకండ్ టాప్
మహిళలపై నేరాల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ సెకండ్ టాప్ (3,030 కేసులు)గా నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది. కేంద్ర హోంశాఖ వెలువరించిన 2022 క్రైమ్ రికార్డు బ్యూరో నివేదికలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పోలిస్తే 20,865 కేసులతో ఫస్ట్ ప్లేస్‌లో తెలంగాణ ఉన్నట్లు తేలింది.
రాష్ట్రంలో నమోదైన ‘మహిళలపై నేరాలు’ కేసుల్లో దాదాపు 9,468 గృహహింసకు సంబంధించినవి. రాష్ట్రం మొత్తంమీద 175 వరకట్న హత్యలు నమోదయ్యాయి. సిటీ శివారులోని బోడుప్పల్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ యువ నేత శ్రీనివాసరెడ్డిని రెండో పెండ్లి ప్రయత్నాల గురించి అతని భార్య సంగీత నిలదీయడంతో శారీరకంగా హింసించి ఇంటి నుంచి గెంటివేసిన వీడియో ఫుటేజీ బైటకు రావడం సంచలనం సృష్టించింది.
మహిళా భద్రతకు కేంద్ర నిధులు
మహిళలకు రక్షణ, భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ ఫండ్‌తో పాటు వన్ స్టాప్ సెంటర్, ఉమెన్ హెల్ప్ లైన్ తదితర స్కీమ్‌ల కింద నిధులు ఇస్తున్నది. నిర్భయ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ నిధులు ఇస్తున్నట్లుగానే పై అవసరాల కోసం తెలంగాణకు ఏడేళ్లలో రూ. 238 కోట్లను విడుదల చేసింది.
ఇందులో దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్రం ఇటీవల వెల్లడించింది. ఇంకా 16% నిధులను ఖర్చు చేయలేకపోయినట్లు పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు కోసం రూ. 48.48 కోట్లు విడుదల చేస్తే రూ. 31.23 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టింది. ఉమెన్ హెల్ప్ లైన్ అవసరాల కోసం రూ. 3.62 కోట్లు విడుదలైతే అందులో రూ. 2.05 కోట్లు మాత్రమే ఖర్చయింది.
Also Read: టికెట్ కోసం ట్రెండ్ మార్చిన BRS లీడర్స్.. KCR దృష్టిలో పడేందుకు నయా క్రియేటివిటీ..!