నోటరీ మ్యూటేషన్లలో ఇష్టారాజ్యం

by Sathputhe Rajesh |
నోటరీ మ్యూటేషన్లలో ఇష్టారాజ్యం
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించిన యజమాని పేరు మార్పు (మ్యుటేషన్) ఇష్టారాజ్యంగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. యజమాని పేరు మార్పు కోసం గతంలో జీహెచ్ఎంసీయే నేరుగా ఆస్తి మార్కెట్ విలువలో సగం రూపాయి శాతం డీడీలు తీసుకుని, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి, సైటును విజిట్ చేసి పేరు మార్చే వారు. కానీ ఇప్పుడు పేరు మార్పునకు సంబంధించిన సగం రూపాయి శాతం (50 పైసల వంతు) సొమ్ము కూడా రిజిస్ట్రేషన్ శాఖ తీసుకుని, ఆ సొమ్మును జీహెచ్ఎంసీకి బదలాయిస్తుంది.

కేవలం రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వివరాల్లో యజమాని పేరును మార్చుతున్నారు. కానీ ఇందులో నోటరీ ఆస్తులుంటే పేరు మార్చుకునే వెసులుబాటు కల్పించినా, యజమాని పేరు కాలమ్‌లో ఆక్యుపైడ్ పర్సన్ అని మాత్రమే పొందుపర్చాలి ఉంది. కానీ లక్షలాది రూపాయల లంచాలు తీసుకుని నోటరీ డాక్యుమెంట్‌తో ఓనర్ కాలమ్‌లో యజమాని పేరు నేరుగా పొందుపరుస్తున్న వ్యవహారం గోషామహాల్ సర్కిల్‌లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఓ ట్రస్టు ఆస్తికి సంబంధించి ఈ ఘనకార్యం చేసినట్లు సమాచారం.

డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ కుమ్మక్కు..?

ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎక్కువ కమర్షియల్ ఆస్తులున్న సర్కిల్ గోషామహల్‌కు ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, బిల్ కలెక్టర్లుగా పోస్టింగ్ దక్కించుకునేందుకు ట్యాక్స్ సిబ్బంది లక్షల రూపాయలతో పైరవీలు చేసుకుంటారు. తాజాగా ఇక్కడి డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ లక్షల్లో లంచాలు తీసుకుని పలు నోటరీ డాక్యుమెంట్లున్న ఆస్తులకు నేరుగా యజమాని పేరిట మ్యుటేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ మ్యుటేషన్లు జీహెచ్ఎంసీకి లీగల్‌గా తలనొప్పిని తెస్తాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్కిల్‌లోని ట్యాక్స్ సిబ్బందికి కూడా తెలియకుండా ఇద్దరు అధికారులు కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా ఈ మ్యుటేషన్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పదుల సంఖ్యలో మ్యుటేషన్లు చేసినట్లు సమాచారం. గతంలో ఇదే రకమైన అక్రమాలకు పాల్పడిన ఓ ఔట్‌సోర్స్ ఉద్యోగిని ఏకంగా విధుల్లో నుంచి తొలగించిన ఉన్నతాధికారులు ఇప్పుడు ఈ రకమైన వ్యవహారానికి పాల్పడ్డ పర్మినెంట్ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

కమిషనర్ ఆర్డర్‌ను జోనల్ కమిషనర్ ఉల్లంఘిస్తారా?

ఈ సర్కిల్‌లో నోటరీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేస్తున్న అధికారుల్లో ఒకరికి గత సంవత్సరం అక్టోబర్‌లో గోషామహల్ సర్కిల్ నుంచి ఎల్బీనగర్ సర్కిల్‌కు బదిలీ అయినా, వెళ్లకుండా అధికారులను మేనేజ్ చేసుకుని ఇక్కడే తిష్టవేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడే కొనసాగుతున్నారేంటి అని అంటే సదరు అధికారి తాను జోనల్ కమిషనర్‌కు చెప్పుకున్నానని సమాధానమిస్తున్నట్లు తెలిసింది.

అంటే కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను జోనల్ కమిషనర్ ఉల్లంఘిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అక్రమాలు జరిగేందుకు పరోక్షంగా ఉన్నతాధికారుల ప్రమేయముందన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత సదరు ఉద్యోగి, ఆ ఆదేశాలను అమలు చేస్తూ, తనకు కేటాయించిన సర్కిల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారా? లేదా? అన్నది సమీక్షించకపోవటం వల్లే అనేక అక్రమాలకు అవకాశంగా మారుతుంది.

Advertisement

Next Story