నువ్వు కట్టుకుంటావా చీర.. లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా? : సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్

by Disha Web Desk 1 |
నువ్వు కట్టుకుంటావా చీర.. లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా? : సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ నాయకుల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బస్సు యాత్రతో గులాబీ బాస్ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ జనజాతర సభల పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలతో బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ నిర్మల్ కాంగ్రెస్ జనజతర సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 తమ అకౌంట్ల వేస్తున్నారని అన్నాడు. అందుకు కౌంటర్‌గా కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ.2,500 చుపిస్తావా.. మరీ ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న 1.67 కోట్ల 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు’ అంటూ ఫైర్ అయ్యారు.

‘వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే’ అని అన్నారు. ‘డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది’ అని ఆరోపించారు. కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ‌లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదని అన్నారు. ‘ఫ్రీ బస్సు కూడా ఓ బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి ఉందన్నారు. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదంటూ అందరికీ తెలిసిపోయింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed