రేవంత్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరవుతారా?

by GSrikanth |   ( Updated:2023-12-07 00:01:13.0  )
రేవంత్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరవుతారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు జరగనున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఇన్విటేషన్లు పంపామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ తరఫున ఎవరు హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఆయన గురువారం ఎక్కడుంటారన్నది పార్టీ వర్గాలు వెల్లడించలేదు.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపైన మాత్రమే కాక పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిపైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసిన కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చని గులాబీ వర్గాల సమాచారం. పార్టీ తరఫున ప్రతినిధులుగా కూడా ఎవ్వరూ హాజరుకాకపోవచ్చని పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీలతో సంబంధం లేకుండా ఇన్విటేషన్లను పంపినట్లు కాంగ్రెస్ పేర్కొన్నది. వివిధ ప్రతిపక్ష పార్టీల అధినేతలను కూడా ఆహ్వానించామని తెలిపింది. నిన్నమొన్నటి వరకూ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సైతం ఆహ్వానాన్ని పంపినట్లు పేర్కొన్నందున ఎవరు అటెండ్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వం తరఫున జరిగే ప్రారంభోత్సవాలకు గవర్నర్‌ను, ప్రతిపక్షాల నేతలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించలేదనే అపవాదు ఉన్నది. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, అమరజ్యోతి ఇనాగరేషన్ లాంటి కీలకమైన కార్యక్రమాలకు ఆహ్వానమే అందలేదని ప్రతిపక్షాల నేతలు అప్పట్లోనే విమర్శించారు. ఈ సంప్రదాయాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నందున బీఆర్ఎస్ చేసిన పొరపాటును చేయరాదనే నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే అన్ని పార్టీలనూ సమదృష్టితో చూసి ఇన్విటేషన్లను పంపినట్లు కాంగ్రెస్ నేతలు ఉదహరించారు. రావడం, రాకపోవడం వారి ఇష్టమని వ్యాఖ్యానించారు.

ఇలాంటి అనుమానాల నేపథ్యంలో ఫామ్ హౌజ్ విడిచిపెట్టి కేసీఆర్ వస్తారా అనే చర్చ మొదలైంది. సిరిసిల్ల టూర్ కోసం బుధవారం అక్కడ పర్యటించిన కేటీఆర్ గురువారం హైదరాబాద్‌కు వస్తారా.. వచ్చినా ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేదో అనే డిస్కషన్ మొదలైంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నందున వారిద్దరిలో ఎవరు వస్తారో.. లేక పార్టీ తరఫున ప్రతినిధిగా ఎవరు హాజరవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed