కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా?

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-03 09:39:42.0  )
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్ 17పై తెలంగాణలో హైవోల్టేజ్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ విమోచన దినోత్సవంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాలైన మూడు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఏడాది పాటు జరిగే ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవం సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో మొదలవుతుందని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా హాజరు కావాలని సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు. విమోచన దినోత్సవం పై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య వార్ జరుగుతున్న నేపథ్యంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఈ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు అవుతారా? లేక ప్రభుత్వం తరపున ఇతర మంత్రులలో ఎవరినైనా పంపుతారా? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విమోచన దినోత్సవంపై ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా సాగుతున్న వ్యవహారంలో కేంద్రం అధికారికంగా నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ గా కేసీఆర్ ను ఇరుకున పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది.

Also Read : Telangana కేబినెట్ భేటీకి ముగ్గురు మంత్రులు డుమ్మా? కారణాలేంటి?

Advertisement

Next Story

Most Viewed