- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP లో ‘పదవుల’ లొల్లి.. ఆందోళన వెనక ఉన్న కీలక నేత ఎవరు?
జిల్లాలోని కమలం పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇటీవల ఇందూరు జిల్లా పరిధి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన పది మంది పాత మండలాధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించారు. దీంతో ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు నేతలు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో చర్చలు విఫలమైనట్లు సమాచారం. తాజాగా సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్‌ను టార్గెట్ చేస్తూ పదవులు తొలగింపునకు గురైన నాయకులు వారి అనుచరులతో నిరసన తెలిపారు. ఏదేమైనా నిరసనలో ఆర్మూర్, బోధన్, బాల్కొండ నాయకులు ఉండడంతో వారిపై బీజేపీ పెద్దలు ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారోననే చర్చ మొదలైంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీలో నివురుగప్పిన నిప్పుల ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన పది మంది పాత మండలాధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. తమను సంప్రదించకుండానే, పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కొత్త వారిని నియమించారని ఆ పార్టీ లీడర్లు భగ్గుమన్నారు. ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను టార్గెట్ చేస్తూ పల్లె గంగారెడ్డి, బస్వాలక్ష్మీనర్సయ్యలపై జిల్లా లీడర్లు మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో చర్చలు జరిపిన అవి ఫలప్రదం కాలేదని తెలిసింది. సోమవారం ఏకంగా పార్టీ జిల్లా కార్యాలయం ఎదుటనే నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రధానంగా పదువులు కోల్పోయిన వారు వారి అనుచరులతో నిరసనకు దిగారు. నిరసనలో ఎంపీని, పల్లెను, బస్వాలను టార్గెట్ చేస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ ఒక వర్గం, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ మరో వర్గం అన్న విధంగా గ్రూపు రాజకీయాలు అందరికీ తెలిసిందే. అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత నుంచి యెండల ప్రభావాన్ని తగ్గించారు. పార్టీ హైకమాండ్ నుంచి మొదలుకుని పార్టీ పదవులు స్థానిక సంస్థల టికెట్లు అన్ని అరవింద్ చెప్పిన వారికే దక్కడంతో రెండు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పునిప్పు మాదిరిగానే ఉండేది. ఎంపీ అరవింద్ ద్వారా పార్టీలోకి వచ్చిన బస్వా అరవింద్ ఎంపీగా గెలువగానే పార్టీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.
కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో అరవింద్‌కు దూరమైన బస్వా, యెండలతో దోస్తి కట్టారు. ఆ దోస్తి మూణాళ్ళ ముచ్చటగానే అయింది. మొన్నటికి మొన్న ఎంపీ అరవింద్ ఆదేశాల మేరకు 13 మండలాలకు కొత్త అధ్యక్షులను నియమించడంతో యెండల వర్గం షాక్‌కు గురైంది. ఎందుకంటే వరంగల్‌లో జరిగిన ప్రధాని మోడీ సమావేశంలో అరవింద్, బస్వా లక్ష్మీనర్సయ్య మధ్య సయోధ్య కుదిరిందని అందుకే కొత్త నియామకాలు పార్టీకి సంబంధం లేకుండానే జరిగాయన్న వాదన తెర పైకి వచ్చింది.
పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు అరవింద్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన పార్టీలోనే కలకలం రేపింది. పార్టీ నుంచి దూరమౌతున్న వినయ్ రెడ్డి వెనుక ఉండి తతంగం నడిపారన్న అనుమానాలను కమలనాథులు చెబుతున్నారు. అయితే బాల్కొండ నియోజకవర్గ నాయకులు గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రుయ్యడి రాజేశ్వర్ ఆందోళనకారులకు మద్దతు పలుకడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి జిల్లాలో పార్టీ ఎదుగుదలకు పాటు పడుతామని, హైదరాబాద్‌లో హామీ ఇచ్చిన నేతలు నిజామాబాద్ జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం కమలం పార్టీ నాయకులకు షాక్ ఇచ్చినట్లయింది.
ఆర్మూర్ లో వినయ్ రెడ్డికి చెక్ పెడుతూ రాకేష్ రెడ్డిని పార్టీలోకి తెచ్చిన నాటి నుంచి అరవింద్‌తో ఆర్మూర్ నాయకులు అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. అదే సమయంలో వినయ్ రెడ్డి కూడా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదోనన్న సంశయంతో పాటు కాంగ్రెస్ గాలి వీస్తుండడంతో అటువైపు కర్చీఫ్ వేశారన్న వాదనలు ఉన్నాయి. అదే సమయంలో పార్టీ నుంచి మరో పార్టీకి మారితే జంప్ జిలానీగా పేరు వస్తుందని అదే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారని సస్పెండ్ అయితే అదే కారణం చూపి పార్టీ మారవచ్చని ఈ తతంగాన్ని నడిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఆర్మూర్, బోధన్, బాల్కొండ నాయకులు ఉండడంతో వారిపై పార్టీ ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది.