ఆ ఊరు జాడేది

by Seetharam |   ( Updated:2023-06-07 14:43:04.0  )
ఆ ఊరు జాడేది
X

దిశ ప్రతినిధి, జగిత్యాల: ఎస్సారెస్పీ ప్రాజెక్టు కోసం ఇండ్లు, భూములు పోగొట్టుకున్న ఆ అభాగ్యులకు ప్రభుత్వ పరిహారం పరిహాసంగా మారింది. ఉన్నదంతా పోగొట్టుకొని పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వలస వచ్చిన గ్రామాల పరిస్థితి దుర్బరంగా మారింది. పునరావసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూములను స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారు. వలస వచ్చిన వారికి ఇచ్చిన భూములు, ఇండ్లను కొందరు పలుకుబడి ఉన్న స్థానిక లీడర్లు రాజకీయ లబ్ది కోసం ఇష్టం వచ్చినట్లు గ్రామ పంచాయతీల పరిధి మార్చడంతో గత నాలుగేళ్లుగా ఓటు హక్కు మినహా ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ది చేకూరడం లేదు. దీంతో వలసదారులు లబోదిబోమంటున్నారు. మరికొందరు స్థానిక నాయకుల వేధింపులు తాళలేక ప్రభుత్వం ఇచ్చిన భూములను అరకొర రేట్లకు అమ్ముకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

ఇదీ వలస గ్రామాల కథ:

మూప్పై ఏళ్ల కింద ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలానికి చెందిన కొన్ని గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అందులో గంగసముందర్, సిరిపురం, నూత్‌పల్లి, గాదెపల్లితోపాటు మరో మూడు గ్రామాలు ఉన్నాయి. బాధిత గ్రామాల ప్రజలకు 1978లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని దొంతాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పునరావాసం కల్పించారు. ఈ గ్రామాలను మొదట తీగల ధర్మారంలో కలిపారు. 15ఏళ్ల తరువాత తీగల ధర్మారం ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పడింది. ఆ తర్వాత ఈ నాలుగు విలీన గ్రామాలను కలిపి గాదెపల్లి పంచాయతీగా గుర్తించారు. ఇందులో గంగసముందర్, నూత్పల్లి నుంచి వలస వచ్చిన వారు అప్పుడున్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్ముకొని సొంత జిల్లాకు వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన బీర్పూర్ మండల పంచాయతీ పరిధిలో నాలుగేళ్ల కింద సిరిపురం గ్రామాన్ని కలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండానే తమను అన్యాయంగా బీర్పూర్ గ్రామ పంచాయతీలో విలీనం చేశారని, తమకు గాదెపల్లిలోనే ఉండాలని ఉందని సిరిపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేనిపక్షంలో సిరిపురం ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఓట్లు మాత్రమే అక్కడ:

వలస వచ్చిన సిరిపురం గ్రామాన్ని గాదేపల్లి నుంచి బీర్పూర్ పరిధిలోకి మార్చడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. బీర్పూర్ మండలానికి అనుబంధ గ్రామంగా మార్చి నాలుగేళ్లు గడిచినా ప్రభుత్వం తమకు కేవలం ఓట్లు మాత్రమే జారీ చేసిందని వలస వచ్చినవారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సుమారు రెండు వందల మందికి నాలుగేళ్లుగా ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయి. చేసేందుకు పనుల్లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు ఇండ్లకు నంబర్లు కేటాయించలేదు. తమ గుర్తింపు కార్డులు గాదెపల్లి పేరు మీదనే ఉన్నాయని, ఓట్లు మాత్రమే బీర్పూర్‌లో ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

ఓట్లకే పని కొస్తామా

సిరిపూర్ గ్రామాన్ని బీర్పూర్‌లో విలీనం చేశాక మాకు ఓటు హక్కు వచ్చింది. కేవలం ఓటు కోసమే పనికొస్తున్నాం. ఉపాధి హామీ పనులు చేస్తున్న 60మంది ఉపాధి కోల్పోయారు. మరో 150మందికి ఇంకా ఉపాధి హామీ కార్డులు మంజూరు కాలేదు. ఓట్లు బీర్పూర్‌లో అడ్రస్ మాత్రం గాదెపల్లిలో ఉండడంతో చదువుకునే పిల్లలకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు స్వార్థంతో ఆలోచించకుండా సిరిపురం ప్రత్యేక గ్రామంగా గుర్తించాలి.

- ఉమేష్ రెడ్డి, సిరిపురం వలస గ్రామస్తుడు

Advertisement

Next Story