- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ సాక్షిగా మాట... అమలవ్వని కేసీఆర్ హామీలు
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇచ్చిన పలు హామీలు ఇంకా అమల్లోకి రాలేదు. సుమారు 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 7,650 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్లతో పాటే వేర్వేరు డిపార్ట్మెంట్లలోకి పంపిణీ చేస్తామన్నారు. వీఆర్ఏలకు ఇరిగేషన్ డిపార్టుమెంటులో లష్కర్లుగా నియమిస్తామంటూ హామీ ఇచ్చారు. మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాన స్థాయిలో వేతనాలను ఇస్తామనీ మాట ఇచ్చారు.
ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయని, ఆచరణలోకి రాలేదనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతున్నది. తాజాగా వీఆర్వోలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో నియమితులైన సుమారు 1500 మంది వీఆర్వోలతో కలిసి దాదాపు ఆరున్నర వేల మంది ఉన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దయ్యి దాదాపు రెండేళ్లు కావస్తున్నది. వీరికి నిర్దిష్టమైన పోస్టింగ్ లేకుండాపోయింది. ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. కానీ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు. పదోన్నతులు లేవు. కొద్దిమంది చనిపోయారు, మరికొద్ది మంది వేర్వేరు కారణాలతో సస్పెండ్ అయ్యారు. కారుణ్య నియామకాలూ లేవు. వారి ప్రొబేషన్ ఇప్పటికీ డిక్లేర్ కాలేదు. వీరిని ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసే ప్రక్రియ గాడిన పడలేదు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు సుమారు పాతిక వేల మంది ఉన్నారు. వీరిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో లష్కర్లుగా నియమించనున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. చాలా మంది విద్యాధికులు ఉన్నారని, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పెరిగినందున అవసరాలకు అనుగుణంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇచ్చి కెనాల్ సిస్టమ్ పనుల్లో వాడుకోవచ్చంటూ వివరించారు. త్వరలోనే ఆ ప్రాసెస్ మొదలవుతుందని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ దీనిపై స్పష్టత లేకపోవడంతో డైలమాలో ఉన్నారు. రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో చేరిన సుమారు 2,900 మంది వీఆర్ఏలతో పాటు మొత్తంగా దాదాపు పాతిక వేల మంది ఉన్నారు.
రాష్ట్రంలోని సుమారు 7,650 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం 2020 జనవరిలో విధుల నుంచి తొలగించింది. గ్రామీణ ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే బాధ్యతలను చూసుకుంటున్న వీరిని తొలగించడంతో అప్పటి నుంచి ఆ పనులను పంచాయతీ కార్యదర్శులు చూసుకుంటున్నారు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం కేసీఆర్ "ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కారు. వారు ఒక భ్రమలో సమ్మెకు పోయారు. పంచాయతీరాజ్ మంత్రి, ఆ శాఖ అధికారులు చెప్పినా వినలేదు. ఇప్పుడు మాది తప్పయింది సార్.. అంటూ తిరుగుతున్నారు. వారిని ఒక పెద్దన్న లాగా హెచ్చరిస్తున్నా. మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం చేయవద్దని కోరుతున్నా. ఫీల్డ్ అసిస్టెంట్లనందరినీ మానవతా దృక్పథంతో వాపస్ తీసుకుంటాం" అని వ్యాఖ్యానించారు.
సెర్ప్, మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని కేసీఆర్ ఇదే సందర్భంలో హామీ ఇచ్చారు. "సెర్ప్ లో నాలుగు వేల మంది పనిచేస్తున్నారు. అది ఒక సొసైటీ. అందులో పనిచేసే వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు. అయినా మహిళా సంఘాలలో అవేర్‌నెస్ పెంచడానికి, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచడానికి వారు విశేషమైన కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. వీరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాన్ని కచ్చితంగా ఇస్తాం. గతంలోనూ మాట ఇచ్చాం" అని హామీ ఇచ్చారు. ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సిబ్బందిని కూడా రెగ్యులర్ చేయడాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
మెప్మా కూడా ఐకేపీ లాంటిదేనని, వారిని కూడా కన్సిడర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని తెలిపారు. ఫైనాన్స్ మినిస్టర్‌తో కూర్చుని ఆ లెక్కలు తేల్చే బాధ్యత పంచాయతీరాజ్ మంత్రి, మున్సిపల్ మంత్రులదేనని పేర్కొన్నారు. దీనిని కూడా ఇన్ కార్పొరేట్ చేసి న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనిపై కదలిక లేదు. రాష్ట్రంలో ఇప్పుడున్న ఉద్యోగుల వేతనాలనే రోజుకో జిల్లా చొప్పున దశలవారీగా ఇస్తున్నందున కొత్తగా వీరందరినీ రెగ్యులరైజ్ చేయడం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వడం ద్వారా ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని ఏ విధంగా భరిస్తుందనే సందేహాలు ఉద్యోగుల నుంచే వ్యక్తమవుతున్నాయి.