Chakrapani Ghanta: అక్కడికి కేసీఆర్ వస్తే ఏమౌతుంది..? ఘంటా చక్రపాణి ఆసక్తిక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-09-03 14:51:58.0  )
Chakrapani Ghanta: అక్కడికి కేసీఆర్ వస్తే ఏమౌతుంది..? ఘంటా చక్రపాణి ఆసక్తిక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టే విషయంలో అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. రాష్ట్రంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో తమ వంతు సహాయం చేయడం మానేసి బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని అధికార పక్షాలు మండిపడుతున్నాయి. దీంతో వరదల్లో సహాయక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది అనే దానిపై రాష్ట్రరాజకీయాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే దీనిపై టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి స్పందిస్తూ.. ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. వరదలు, ఇతర విపత్తుల సందర్భంగా ప్రభుత్వమే రంగంలో ఉండాలన్నది మొదటి నియమం అని, అయితే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రభుత్వం, అధికారుల సహాయక చర్యలకు ఆటంకం కలుగకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలు, నేతలు దూరంగా ఉండాలని సూచిస్తుందని తెలిపారు. ఇటువంటి సందర్భాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి, మంత్రులు నేరుగా సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో ఉంటూ ఆదేశాలు ఇవ్వాలి అంతే తప్ప రేవంత్ రెడ్డి చెపుతున్నట్టు ప్రతిపక్ష నాయకులు, రాజకీయ పార్టీలు చేయాల్సిన పని అది కాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ యంత్రాంగం విఫలమై, సహాయ పునరావాసం అందనప్పుడు ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్షాలు చివరకు ప్రజలు ఎవరికి తోచిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటారని అన్నారు. మొన్న ఖమ్మంలో హెలికాప్టర్ రాకపోతే ఒక వ్యక్తి జేసీబీ తో వెళ్లి పదిమందిని కాపాడారని, కానీ అది ప్రభుత్వ వ్యవస్థకు అప్రతిష్ఠ కలిగిస్తుందని చెప్పారు. ఇది సహాయం మాత్రమే అవుతుందని, పునరావాసం ప్రభుత్వమే చేయాలని సూచించారు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటనకో, పరామర్శకో వస్తే ఏమవుతుందో ఆలోచించాలని, ఆయన వెంట వందలాది మంది, అలాగే మీడియా, వారి భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ సహాయక చర్యలకు విఘాతం కలిగించవా? అని ఘంటా చక్రపాణి ప్రశ్నించారు.




Advertisement

Next Story

Most Viewed