ఈ నగరానికి ఏమైంది..? మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ ఇదే

by Ramesh N |
ఈ నగరానికి ఏమైంది..? మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: “ఈ నగరానికి ఏమైంది?" అని పలు పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వార్తలు వస్తున్నాయంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పరిపాలన అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని విమర్శించారు. "బ్రాండ్ హైదరాబాద్" ఎందుకు మసకబారుతోంది? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ ఎందుకింత కళ కోల్పోతోందని ప్రశ్నించారు. సగటు హైదరాబాదీకి కలుగుతున్న భావన ఇది అని పేర్కొన్నారు.

హైదరాబాద్ ను ప్రేమించే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవేదన ఇదన్నారు. పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు పెరిగిపోతున్నాయని, అంతరాష్ట్ర ముఠాలు పేట్రేగి పోతున్నాయని వెల్లడించారు. రాజధానిలో శాంతి లేదని, నగర ప్రజల జీవితాలకు భద్రత లేదన్నారు. సీఎం స్వయంగా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తున్నా పోలీసింగ్ పై కమాండ్ ఏది? అని ప్రశ్నించారు. ఓవైపు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందన్నారు. మరోవైపు పడగవిప్పిన హత్యల సంస్కృతి ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందని పేర్కొన్నారు. ఇంకోవైపు పెట్టుబడుల పర్వం తరలిపోతోందని, యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పవర్ లోకి రాగానే గడియ గడియకు ఏమిటి.. పవర్ కట్? అని ప్రశ్నించారు.

సేఫ్ సిటీ గా ఉన్న మహానగరంలో ఎందుకు పెరుగుతోంది.. క్రైమ్ రేట్? అని ప్రశ్నించారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని విమర్శించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని నిలదీశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా? అని పేర్కొన్నారు. దేశ రాజధాని చుట్టూ రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అంటే కేవలం రాజధాని కాదు.. "తెలంగాణ ఎకనామిక్ ఇంజన్ " అని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే మన హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టం అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed