కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నా: కాంగ్రెస్ ఎంపీ చామల

by Mahesh |   ( Updated:2024-08-31 14:56:27.0  )
కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నా: కాంగ్రెస్ ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూ‌‌రో: కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల తరుపున మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను పదే పదే సూచించామని, కానీ ఆయన మొహం చాటేశారన్నారు. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని బుద్ధి కలగడం సంతోషమన్నారు. అయితే వచ్చే ముందు 2014,2018 మేనిఫెస్టోలను వెంట పెట్టుకొని రావాలన్నారు. ఎన్నింటిని నెరవేర్చారో చదువుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాను కూడా 2023 మేనిఫెస్టోను తీసుకొని వస్తానన్నారు. ఎవరు ఏం చేశారో? యాదాద్రి సాక్షిగా చర్చ పెడదామన్నారు.దళిత సీఎం మొదలు, దళితులకు మూడెకరాల భూమి వరకు అన్నింటికీ కేసీఆర్ పంగనామం పెట్టారన్నారు.

ఇక తెలంగాణ డెవలప్‌మెంట్ కోసం బీజేపీపై ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విభజన హామీలు అమలు చేయాలని సీఎం, మంత్రులు ఇప్పటికే చాలా సార్లు కలిశారని, కానీ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని గుర్తు చేశారు. ఇక హరీష్​ రావు కమిషన్ కాకతీయ రూపకర్త అని, చెరువులు కడుతుంటే విమర్శలు చేస్తున్నారన్నారు. 33 జిల్లాలలో పది వేల కోట్ల తో నిధులు కేటాయించి కమిషన్లు తీసుకున్నారన్నారు. అందుకే ఆ పనులను తొలగించామన్నారు. కాంగ్రెస్ బుల్డోజర్ ప్రభుత్వమని, కేటీఆర్ ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేకు ట్వీట్ చేస్తున్నాడని మండిపడ్డారు. ఏం చేయడం లేదో? కేటీఆర్ స్పష్టం గా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మున్సిపల్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇల్లీగల్ నిర్మాణాన్ని లీజ్ కు తీసుకోకూడదనే సోయి కూడా లేదని మండిపడ్డారు.

Advertisement

Next Story