కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తాం!.. పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-07-02 09:34:21.0  )
కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తాం!.. పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజారవాణాకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కొత్త రక్తంతో ఆర్టీసిని మరింత బలోపేతం దిశగా పని చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని పొన్నం తెలిపారు.

ఈ కొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని, మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాగా టీజీఎస్‌ఆర్టీసీ లో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు కోరుతూ.. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు.

దీనికి ప్రభుత్వం స్పందిస్తూ.. అధికారులు ప్రతిపాధనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం అనుమతించిన ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్‌ పోస్టులు కాగా.. 743 శ్రామిక్‌ పోస్టులు ఉన్నాయి. అలాగే మెకానిక్ విభాగంలో 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు, ట్రాఫిక్ విభాగంలో 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు, 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ సివిల్ ఇంజనీర్‌, 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌, సివిల్ విభాగంలో 11 సెక్షన్‌ ఆఫీసర్‌, జనరల్ విభాగంలో 7 మెడికల్‌ ఆఫీసర్‌, 7 మెడికల్‌ ఆఫీసర్‌ కొలువులు ఉన్నాయి.

Advertisement

Next Story