ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించబోము! మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

by Geesa Chandu |
ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించబోము! మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
X

దిశ, సికింద్రాబాద్: ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించబోమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసి మహిళను సీతక్క పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాధిత మహిళకు ఎస్టి సంక్షేమ శాఖ తరపున లక్ష రూపాయల పరిహారాన్ని తన కుటుంబ సభ్యులకు అందజేశామని చెప్పారు. ఈ ఘటన విషయంలో కొందరు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలు ఆర్థిక సాయం చేసిన కొందరు దాన్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. దాడి ఘటన పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. మహిళలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని చెప్పారు. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తెలిపారు. చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎంతటి వారైనా వదిలీపెట్టే ప్రసక్తి లేదన్నారు. కొంతమంది రాజకీయ ముసుగులో మతం రంగు పూసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీతక్కను అడ్డుకున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు..

ఆసిఫాబాద్ జిల్లా ఆటో డ్రైవర్ దాడిలో గాయపడ్డ మహిళను పరామర్శించడానికి గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్కను బీజేపీ మహిళా మోర్చా నాయకులు అడ్డుకొని నిలదీశారు. హస్తం హటావో.. బేటి బచావో.. అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళపై రోజుకో అత్యాచారం జరుగుతున్న పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై జరిగింది అత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెబుతున్నప్పటికి మంత్రి సీతక్క కేసును పక్కతోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ ఘటనను అత్యాచారం, హత్య యత్నంగా చూడాలని, కమ్యూనల్ ఇష్యూ గా సూచించారు. నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదుచేసి, ఉరిశిక్ష విధించి, బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed