రేపు జన జాతీయ గౌరవ్ దివస్

by Shiva |   ( Updated:2024-11-14 16:04:05.0  )
రేపు జన జాతీయ గౌరవ్ దివస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం అనేక ప్రత్యేక, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వారికి ఉజ్వలమైన, సమ్మిళిత భవిష్యత్తును అందించే దిశగా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలను పదేళ్లలో ప్రభుత్వం చేపట్టింది. భగవాన్ బిర్సా ముండా జయంతి నవంబర్ 15 జన జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించింది. గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది.

ఎస్టీల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక నిధులు 2013-14లో రూ.24,600 కోట్ల నుంచి 2024-25 నాటికి దాదాపు ఐదు రెట్లు పెరిగి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి. పాఠశాలల్లో నమోదైన వారి సంఖ్య 2013-14లో రూ.34 వేలు ఉండగా, 2023-24 నాటికి అది రూ.1.3 లక్షలకు పెరిగింది. ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు (ఈఎంఆర్ఎస్) పెరగడం ఈ మార్పునకు మూలకారణం. దశాబ్ద కాలంలోనే వాటి సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 123 నుంచి 476కు చేరింది. రక్తహీనతను అరికట్టడానికి ప్రభుత్వం సికిల్ సెల్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే 4.6 కోట్ల మందిని పరీక్షించారు. మూడేళ్లలో 7 కోట్ల మందికి ఈ పరీక్షలను చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏటా 30 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ఉపకారవేతనాల ద్వారా లబ్ధి చేకూర్చుతుంది.

గత పదేళ్లలో మొత్తం రూ.17వేల కోట్ల ఉపకారవేతనాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం 3,900 వన్ ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దాదాపు 12 లక్షల మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు అవసరమైన వనరులను సమకూర్చుతున్నారు. భారతదేశపు తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక గిరిజన ప్రాతినిధ్యంలో ఒక ప్రతిష్ఠాత్మకమైన ముందడుగు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో సమ్మిళిత్వాన్ని సాధించింది. పీఎం-జన్‌మన్ ద్వారా గృహ నిర్మాణం, శుద్ధమైన నీరు, పారిశుధ్యం, ఆరోగ్య రక్షణ వంటి అత్యవసర సేవలు గిరిజనులకు అందుతున్నాయి. 75 అత్యంత దుర్భర గిరిజన సమూహాలు (పీవీటీజీ), 45 లక్షలకు పైగా కుటుంబాలకు రూ.24వేల కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారు.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో షెడ్యూల్ తెగలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. వెదురును చెట్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా స్వేచ్ఛగా దానిని కోసుకోవడానికి గిరిజనులకు అవకాశం లభించింది. ఈ మార్పు గిరిజన కుటుంబాలకు సరికొత్త ఆదాయవనరుగా మారడంతోపాటు ‘ఆకుపచ్చ బంగారం’గా వెదురు.. గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడుతోంది. తొలిసారిగా గిరిజన వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చేందుకు, 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజన ప్రజలకు 100శాతం ప్రయోజనాలు చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ.80వేల కోట్ల బడ్జెట్‌తో దేశంలోని గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సాధికారతను సాధించే దిశగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కనీస మద్దతు ధర పొందే చిన్న అటవీ ఉత్పత్తుల సంఖ్యను 12 నుంచి 87కు పెంచారు.

Advertisement

Next Story

Most Viewed