విద్యుత్ సంస్థల గేట్లకు తాళాలేస్తాం: MP ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-02-17 16:28:04.0  )
విద్యుత్ సంస్థల గేట్లకు తాళాలేస్తాం: MP ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, లేదంటే విద్యుత్ సంస్థల గేట్లకు తాళం వేస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో శాఖ డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటనలు జారీ చేసిందని, అందులో ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోల ఆధారంగా గరిష్ట వయస్సు పరిమితి 62గా నిబంధన పెట్టారని, కానీ, 2012లో జీవో 18లో తెలిపిన ప్రకారం గరిష్ట వయస్సు పరిమితి 65గా ఉండేదని ఆయన గుర్తుచేశారు. 2013లో జీవో 18ని సవరిస్తూ గరిష్ట వయస్సును 62గా మార్చారన్నారు.

అప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలుగా ఉండేదని ఆయన వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాలుగా పెంచారని, దాని ప్రకారం చూస్తే డైరెక్టర్ పోస్టులకు గరిష్ట వయస్సు పరిమితిని 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాల్సి ఉందన్నారు. మరోవైపు విద్యుత్ సంస్థల్లో బీసీ, ఓసీ ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ స్థాయి పదోన్నతి పొందలేకపోతున్నారని వివరించారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కల్పిస్తున్న రిజర్వేషన్లను లోపభూయిష్టంగా అమలు చేశారని కృష్ణయ్య ధ్వజమెత్తారు.

ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో చీఫ్ జనరల్ మేనేజర్, చీఫ్ ఇంజనీర్ స్థాయి పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సుమారుగా 30 మంది అర్హత కలిగి ఉన్నారన్నారు. బీసీలను పరిశీలించినట్లయితే మొత్తం విద్యుత్ సంస్థల్లో 8 మంది మాత్రమే డైరెక్టర్ పోస్టుకు అర్హత కలిగి ఉన్నారన్నారు. అందుకే గరిష్ట వయసు పరిమితిని 65కు పెంచకుండా డైరెక్టర్ ఉద్యోగుల డైరెక్టర్ పోస్టులను నియమించినట్లయితే బీసీ, ఓసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే సీఎం స్పందించి డైరెక్టర్ పోస్టుల భర్తీలో గరిష్ట వయస్సును 62 నుంచి 65కు పెంచి నియామకాలు చేపట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed