రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రూపు రేఖలు మారుస్తాం: మంత్రి జూపల్లి

by Satheesh |
రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రూపు రేఖలు మారుస్తాం: మంత్రి జూపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే తెలంగాణ టూరిజం స్పాట్‌గా తయారు చేస్తామన్నారు. ఆదివారం బేగంపేటలోని హోట‌ల్ హ‌రిత ప్లాజాలో ప‌ర్యాట‌క శాఖ స‌హ‌కారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 3వ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లాన‌ర్స్ కార్యక్రమానికి మంత్రి హజరయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వివాహా వేడుక‌లకు గ‌మ్య స్థానంగా హైద‌రాబాద్, దాని చుట్టు పక్కల ఫంక్షన్ హాల్స్, క‌న్వన్షన్ సెంట‌ర్లు, రిసార్టుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారన్నారు. కానీ వివిధ జిల్లాల్లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు, పుష్కలమైన వనరులు, చారిత్రాత్మక ప్రాముఖ్యత, పచ్చని కొండలు ఉన్నాయన్నారు. సాగర్ తీరం, కృష్ణానదీ తీరాన కొల్లాపూర్‌లోని సోమశీల బ్యాక్ వాటర్ కూడా అద్భుతంగా ఉన్నదన్నారు. ఆయా ప్రాంతాల్లో టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాల‌నే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మెడికల్, ఎకో, అడ్వెంచర్, స్పిరిచ్యువల్ తదితర టూరిజం రంగాలపై దృష్టి పెట్టిన‌ట్లు వివ‌రించారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ప‌ర్యాట‌క శాఖ అభివృద్ధితో ఆదాయం పెర‌గ‌డంతో పాటు యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను ల‌భిస్తాయ‌ని అన్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ హాబ్‌గా, పర్యాటక రంగానికి ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని మరింత పటిష్టం చేయ‌డానికి ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప‌ర్యాట‌క శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ర‌మేష్ నాయుడు, ప‌ర్యాట‌క శాఖ డైరెక్టర్ కె. నిఖిల‌, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story