డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-07-13 13:28:48.0  )
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించామని.. ఈ యుద్ధంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యూనిఫాం లేని పోలీసులు ఎన్ఎస్ఎస్ అని.. మోరల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఎన్ఎస్ఎస్‌దేనని అన్నారు. శనివారం జేఎన్టీయూలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రొగ్రామ్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా ఉన్నది విద్యార్థులేనని, అలాంటి విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసైతే ఈ సమాజం ఏం కావాలని ప్రశ్నించారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లే పిల్లలు పక్కదారి పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులు అందరూ మన పిల్లలే అనేలా ఉపాధ్యాయులు చూసుకోవాలని, వారికి మంచి ఏదో చెడు ఏదో చెప్పాల్సిన బాధ్యత మనదేనని అన్నారు.

తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలని.. వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. పిల్లలకు మోరల్ పోలీసింగ్ నేర్పాలని స్కూళ్లు, కళాశాలల యాజమానులకు చెప్పామని.. పిల్లల బిహేవియర్‌లో తేడా వస్తే తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. బాధ్యత కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. పోలీసు ఆఫీసర్స్ వారంలో రెండు రోజులు స్కూళ్లు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఇక, క్రీడాకారులను తమ ప్రభుత్వం మరింత ప్రోత్సాహిస్తోందని స్పష్టం చేశారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందో.. రాదో తెలియదు కానీ క్రీడాకారులుగా రాణిస్తే తప్పుకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత సమస్యలకు ఎప్పుడూ భయపడకూడదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed