తెలంగాణకు 5.4, ఏపీకి 4.5 టీఎంసీలు.. జూలై, ఆగస్ట్ నెలలకు నీటి వాటా పంపిణీ కంప్లీట్

by Satheesh |
తెలంగాణకు 5.4, ఏపీకి 4.5 టీఎంసీలు.. జూలై, ఆగస్ట్ నెలలకు నీటి వాటా పంపిణీ కంప్లీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకున్న కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు రానున్న రెండు నెలలకు నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో జలసౌధలో సోమవారం జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పరస్పర అవగాహనతో నీటి విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినట్లు బోర్డు సభ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఆ అవగాహన ప్రకారం తెలంగాణకు 5.414 టీఎంసీలు, ఏపీ 4.5 టీఎంసీల చొప్పున నీటిని డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు. కేవలం తాగునీటి అవసరాలకే వాడాలని, ఇతర ప్రయోజనాలకు వినియోగించరాదని స్పష్టం చేశారు. ఈ నీటి విడుదల, వినియోగంపై రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించి జాయింట్ రిపోర్టును బోర్డుకు అందజేయాలన్నారు.

ప్రస్తుతం (జూలై 15 నాటికి) శ్రీశైలంలో 5.705 టీఎంసీల (803 అడుగుల నీటి మట్టం) నీటి నిల్వలు ఉన్నాయని, వీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని, 10% మేర ఆవిరి రూపంలో ఖర్చయినా నికరంగా 5.134 టీఎంసీలు ప్రవహిస్తాయని బోర్డు సభ్య కార్యదర్శి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ దగ్గర (500 అడుగుల నీటి మట్టం) 4.780 టీఎంసీల నీరు ఉన్నదని, శ్రీశైలం నుంచి వచ్చేదానితో కలిపితే మొత్తం 9.914 టీఎంసీలు వినియోగానికి సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు కేటాయించిన వాటా మేరకు వాడుకోవాలన్నారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాల్సిందిగా ఏపీ రిక్వెస్టు చేసింది. పాలేరు, ఉదయసముద్రం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా అక్కడి ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటి అవసరాల కోసం తెలంగాణ రిక్వెస్టు చేసింది.

నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి నీటిని సరఫరా చేయాలని, అక్కడ విద్యుత్ ఉత్పత్తిని చేయడం ద్వారా విడుదలయ్యే నీటిని అందజేయాలని బోర్డు సభ్య కార్యదర్శి పేర్కొన్నారు. సాగర్ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున ఏపీకి నీటిని బుధవారం నుంచే విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలోని నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed