జోరుగా ఇసుక అక్రమ ర‌వాణా..ఆపేదెవ‌రు..? అడ్డుకునేదెవ‌రు?

by Aamani |
జోరుగా ఇసుక అక్రమ ర‌వాణా..ఆపేదెవ‌రు..? అడ్డుకునేదెవ‌రు?
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో / చిట్యాల : అనుమతుల్లేకుండా ఒకరు.. అనుమతుల పేరుతో మరికొందరు పట్టపగలే సహజవనరులను దోచుకుంటున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా టేకుమ‌ట్ల, చిట్యాల‌, మొగుళ్లప‌ల్లి మండ‌లాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండ‌తో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. టేకుమ‌ట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల మండ‌లాల్లో ప్రవ‌హించే మానేరు, చ‌లివాగుల నుంచి నిర్విరామంగా ఇసుక దోపిడీ జ‌రుగుతోంది. ఈ వాగుల నుంచి భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల‌, హ‌న్మకొండ‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట ప్రాంతాల‌కు ట్రాక్టర్ల ద్వారా ఇసుక‌ను పెద్ద ఎత్తున అక్రమంగా త‌ర‌లిస్తున్నారు. కొన్ని రోజులుగా ఇసుక దందా మూడు ‘పువ్వులు.. ఆరు కాయలు’గా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా మొదలు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అధికారపార్టీ నేత‌ల అండ‌..!

గ్రామ స్థాయిలోని కొంత‌మంది కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా ఇసుక ర‌వాణాలో భాగ‌స్వాముల‌వుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. టేకుమ‌ట్ల మండ‌లంలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు స‌మాచారం. పర్మిషన్ లేకున్నా ఇసుకను తరలిస్తున్నారని ప్రశ్నిస్తే, అధికారుల అండదండలు ఉన్నాయని, ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అంటూ ఎదురు దాడికి దిగుతున్న సందర్భాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టపగలే అతివేగంతో ట్రాక్టర్లు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక దందాకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు. చిట్యాల మండ‌లంలోని కాల్వప‌ల్లి చ‌లివాగు నుంచి, టేకుమట్ల మండలంలోని కలికోట, వెంకట్రావుపల్లి, బూర్హన్​ప‌ల్లి, ఎంపేడు గ్రామాల‌ను ఆనుకుని ప్రవ‌హించే చలివాగు పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక‌ను కొల్లగొడుతున్నారు. మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ ర‌వాణా జ‌రుగుతోంది.

అనుమ‌తుల మాటున దందా..!

పోలీసులు, అధికారులు ఎవరైనా అడిగితే తెచ్చుకున్న అనుమతులు చూపుతున్నారు. అనుమతులు పొందిన టిప్పర్ల ద్వారా ఇసుకను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకే రవాణా చేయాల్సి ఉంది. కానీ ఉదయం 7 గంటల నుంచే రవాణా మొదలవుతోంది. ఎన్ని ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి చేరవేస్తున్నారన్న దీనిపై అధికారుల నిఘా కరవైంది. దీంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. అనుమతుల పేరుతో టిప్పర్లలో ఇసుక రవాణా ఒక ఎత్తయితే.. ఎలాంటి అనుమతులు లేకుండానే వాగుల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలించడం మరో ఎత్తు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన అధికారులు, పోలీసులు చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed