Errabelli : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం

by Kavitha |
Errabelli : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం
X

దిశ, రాయపర్తి : రాష్ట్రంలో ప్రజలను హామీల పేరుతో తప్పుదోవ పట్టించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టి తీరుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ కార్యకర్తలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అసాధ్యమైన హామీలను ప్రజలకు ఆశ చూపి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది అన్నారు. తాము ఇస్తామన్న హామీలను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చేయలేదని నిలదీశారు.

రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చేవరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అన్నారు. ఈనెల నాలుగోవ తేదీన తొర్రూర్ లో రెండు లక్షల రూపాయలను సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాను రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు.

రైతులకు రైతు భరోసా కింద రూ.15,000, కూలీలకు రూ.12 వేల లాంటి పథకాలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలలో నిరాశ నెలకొంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మూణావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్, జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఎండి నయీమ్, పి ఎస్ ఎస్ చైర్మన్ కుందూరురామచంద్రారెడ్డి, కార్యదర్శి పూజ, మధు, నాయకులు అశరఫ్, సంతోష్ గౌడ్, అయిత రామచందర్ ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed