- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Warangal: సరిహద్దులు దాటుతున్న బియ్యం.. గోదావరి ఒడ్డున పీడీఎస్ వీరుడు
దిశ, వరంగల్ బ్యూరో : తెలంగాణ పేద ప్రజల రేషన్ బియ్యం రాష్ట్రం ఎల్లలు దాటిపోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి అవతలి వైపు ఉన్న మహారాష్ట్రలోని సిరొంచకు పెద్ద మొత్తంలో పీడీఎస్బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రోజూ వందల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా సిరొంచలోని రైస్ మిల్లులకు తరలిపోతుండటం గమనార్హం. భూపాలపల్లి జిల్లాలో కాటారం, మహదేవ్‌పూర్ మండలాల్లో పీడీఎస్ రైస్ డాన్‌లుగా పేరుగాంచిన ఓ నలుగురు పెద్ద మొత్తంలో బియ్యం అక్రమ రవాణా చేపడుతున్నారు. బియ్యం అక్రమ రవాణాలో వీరుడిగా పేరొందిన ఓ స్మగ్లర్ కు పోలీస్, రెవెన్యూ సివిల్ సప్లయ్ శాఖ అధికారులు కూడా పూర్తి సహకారం అందజేస్తుండటంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదని సమాచారం. భూపాలపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భారీ నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న ఈ స్మగ్లర్ అధికారులను గుప్పిట పట్టుకుని దందాను జోరుగా నడిపిస్తున్నాడు.
రీ సైక్లింగ్..!
చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలుతున్నది. అక్కడి ఓ గోదాములో అక్రమంగా నిల్వచేసి తిరిగి తెలంగాణకే పంపిస్తున్నారు. వాటిని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి సన్నబియ్యం స్థానంలో ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఈ తతంగాన్నంతా ఒకే వ్యక్తి నడిపిస్తున్నాడు. అడ్డుకున్న అధికారులను తన దారికి తెచ్చుకుంటూ అక్రమంగా పీడీఎస్ దందా కొనసాగిస్తుండటం గమనార్హం. భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి నిత్యం 500పై చిలుకు క్వింటాళ్ల బియ్యాన్ని దళారులు ఎల్లలు దాటిస్తున్నారు. సిరొంచ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర వంతెన ద్వారా ఈ బియ్యం రవాణా జరుగుతోంది. లబ్ధిదారుల నుంచి కిలో రూ.10కు కొనుగోలు చేసి దళారుల ద్వారా సిరొంచకు తరలిస్తున్నారు. అక్కడ ఓ బడా స్మగ్లర్‌కు కిలో రూ.12-15 వరకు విక్రయిస్తున్నారు. ఇలా గోదావరి ఒడ్డు వరకు చేరుతున్న రేషన్ బియ్యాన్ని బడా స్మగ్లర్ అంతర్రాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్రలోని మిల్లులకు వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా వెళ్తున్న బియ్యాన్ని అక్కడ ఒకే రకమైన సంచుల్లోకి మార్చి అక్కడి నుంచి పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లుల్లో రీ సైక్లింగ్ చేసిన అనంతరం తిరిగి ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని పాస్ చేసే విషయంలో సంబంధితఅధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం.
చూసీ చూడనట్లుగా అధికారుల తీరు..
రేషన్ బియ్యం అక్రమ దందాపై పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రైస్‌మిల్లుల కేంద్రంగా ఈ దందా నడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బడా స్మగ్లర్లను వదిలిపెడుతున్న అధికారులు చిన్న మొత్తంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని పట్టుకుంటూ మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు తెలియకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్న చిన్న స్మగ్లర్లను పోలీసులకు పట్టించేస్తూ మొత్తం పీడీఎస్ దందాను తమ కంట్రోల్‌లో ఉండేలా చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ దందాలో కొంతమంది ప్రజాప్రతినిధులకు సైతం వాటాలు వెళ్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే అధికార వర్గాలు సైతం మనకెందుకులే అంటూ మాములుగా వదిలేస్తున్నట్లు సమాచారం.