చిహ్నంలో మార్పుపై స‌మ‌ర‌మే..! కాక‌తీయ క‌ళా తోర‌ణం తొల‌గింపుపై బీఆర్ఎస్ సైర‌న్‌

by Shiva |
చిహ్నంలో మార్పుపై స‌మ‌ర‌మే..! కాక‌తీయ క‌ళా తోర‌ణం తొల‌గింపుపై బీఆర్ఎస్ సైర‌న్‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: రాష్ట్ర అధికారిక ముద్రలో కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని తొల‌గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన మార్పుల‌పై బీఆర్ఎస్ భ‌గ్గుమంటోంది. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణం తొల‌గింపుపై ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండ‌గ‌ట్టాల‌ని భావిస్తోంది. కేసీఆర్ పాల‌న ఆన‌వాళ్లను ప‌నిగ‌ట్టుకుని చెరిపేయాల‌నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంద‌ని, అదే విష‌యాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని వ్యూహర‌చ‌న చేస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక వ‌రంగ‌ల్ చారిత్రక న‌గ‌రానికి, కాక‌తీయుల‌ను స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర చిహ్నంలో కాక‌తీయుల తోర‌ణాన్ని పొందుప‌ర్చితే.. నేటి ప్రభుత్వం క‌క్షసాధింపు చ‌ర్యల‌తో తొల‌గిస్తోంద‌నే విష‌యాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిస్తోంది.

ప్రజా ఉద్యమంగా మ‌లిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కాక‌తీయ తోర‌ణం తొల‌గింపును అడ్డుకోవాల‌ని సిద్ధం చేస్తోంది. ఈ మేర‌కు వ‌రంగ‌ల్ కేంద్రంగా ప్రజా ఉద్యమాన్ని మొద‌లు పెట్టి రాష్ట్ర వ్యాప్తం చేయాల‌నే వ్యూహ ర‌చ‌న చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. చిహ్నంలో మార్పుల‌పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోబోమమ‌ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రక‌టన వెలువ‌డిన విష‌యం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆందోళ‌న‌ల‌తోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక‌ట‌న చేసింద‌ని భావిస్తున్న ఆ పార్టీ లీడ‌ర్లు.. ఇది పార్టీ విజ‌యంగా చెప్పుకుంటున్నారు. అయితే చిహ్నంలో మార్పులుండ‌బోవని స్పష్టమైన వైఖ‌రితో కూడిన ప్రక‌ట‌న వెలువ‌డేంత వ‌ర‌కు ఈ విష‌యంపై ప్రజా ఉద్యమాలు చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ భావిస్తుండ‌డం గ‌మనార్హం. - దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో

నేడు కాళోజీ జంక్షన్‌లో ధ‌ర్నా..

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రణ‌లో నుంచి కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని తొల‌గించ‌డాన్ని నిర‌సిస్తూ శుక్రవారం హ‌న్మకొండ జిల్లా అధ్యక్షుడు విన‌య్‌భాస్కర్ ఆధ్వర్యంలో కాళోజీ జంక్షన్ ధ‌ర్నా చేప‌ట్టనున్నారు. ఈ ధ‌ర్నా వేదిక నుంచే భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ కూడా ప్రక‌టించ‌నున్నట్లు స‌మాచారం. ద‌శ‌ల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఆ పార్టీ శ్రేణుల‌ను ఆక్టివ్ చేసేందుకు, ప్రజా క్షేత్రంలో మ‌ద్దతు పొందేందుకు ఈ కార్యక్రమాలు దోహ‌దం చేస్తుంద‌నే భావ‌న‌తో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిహ్నంలో చార్మినార్‌, కాక‌తీయ క‌ళాతోర‌ణాల తొల‌గింపును నిలుపుద‌ల చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ.. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ హైకోర్టులో వాజ్యం దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు న్యాయం పోరాటం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామంటూ ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. వ‌రంగ‌ల్‌లో భారీ నిర‌స‌న కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండ‌గా ఈ కార్యక్రమానికి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీమంత్రి హ‌రీష్‌రావును కూడా తీసుకురావాల‌నే యోచ‌న‌తో ఉంది.

బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులు..!

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం ఖిలా వ‌రంగ‌ల్ కోట శిల్పాల ఆవ‌ర‌ణ‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ నేతృత్వంలో హ‌న్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్కర్‌, వ‌రంగ‌ల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్‌, న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ మ‌ర్రియాద‌వ‌రెడ్డితో పాటు వ‌రంగ‌ల్‌, హన్మకొండ జిల్లాల‌కు చెందిన ప‌లువురు ముఖ్య నేత‌లు నిర‌స‌న‌కు దిగారు. వెంట‌నే రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణం తొల‌గింపును మానుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న స‌మ‌యంలో నిర‌స‌న‌ల‌కు దిగారంటూ వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని మిల్స్ కాల‌నీ పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌‌పై కేసులు న‌మోదు చేశారు.

ఇర‌కాటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని తొల‌గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన మార్పుల‌పై వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేత‌లు మౌనం దాల్చుతున్నారు. కాక‌తీయ క‌ళాతోర‌ణం తొల‌గింపుపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యత‌లు చేప‌ట్టిన నాటి నుంచి వినిపిస్తూ వ‌స్తున్నాయి. ఈ క్రమంలోనే వ‌రంగ‌ల్ జిల్లా ఎమ్మెల్యేల‌తో జ‌రిగిన స‌మావేశంలో సీఎంకు మూకుమ్మడిగా మార్పు చేప‌డితే వ్యతిరేక స్వరాలు వినిపిస్తాయ‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన‌ట్లు విశ్వస‌నీయ స‌మాచారం. అయితే తాజాగా ప్రభుత్వం చిహ్నంలో కాక‌తీయ తోర‌ణాన్ని తొల‌గించేందుకు మొగ్గు చూప‌డంతో ఈ విష‌యంపై బీఆర్ఎస్ పార్టీ ఆందోళ‌న‌లు చేప‌డుతూ ప్రజా మ‌ద్దతు కూడ‌గ‌ట్టుకునే ప్రయ‌త్నం చేస్తుండ‌గా, దీన్ని ఎలా స‌మ‌ర్థించుకుంటూ తిప్పికొట్టాలా..? అంటూ కాంగ్రెస్ నేత‌లు కాస్త మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. మొత్తంగా ఈవిష‌యంపై కాంగ్రెస్ నేత‌లు ఇర‌కాటంలో ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయం అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed