కబ్జాకోరల్లో దేవుడి భూమి.. కమిషనర్‌కు ఫిర్యాదు.. విచారణ షురూ

by Vinod kumar |
కబ్జాకోరల్లో దేవుడి భూమి.. కమిషనర్‌కు ఫిర్యాదు.. విచారణ షురూ
X

దిశ, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 316 లో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి స్థలం కబ్జా వివాదంపై పోలీసులు స్పందించారు. ఆదివారం 'దిశ' దినపత్రిక సహా పలు పత్రికలలో ఈ కబ్జాపై కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే, లింగాల వెంకటరంగారెడ్డి కి చెందిన ఈ భూమిని రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ దూకిరే శంకర్రావు హయాంలో వెంకటరంగారెడ్డి కుటుంబీకులు గ్రామ అవసరాల కోసం విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లు ఈ భూమి వైపు చూడలేదు.

రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని స్థానికులు కొందరు తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించి, ఆ తర్వాత రిజిస్టర్ డాక్యుమెంట్లుగా ఇతరులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. దీని వెనుక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నాయకులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వివాదంపై ఆదివారం పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులన్నింటిని స్థానికులు వరంగల్ కమిషనర్ సీపీ. ఏవి. రంగనాథ్ కు పంపించారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇందులో భాగంగా రూరల్ సీఐ ఆర్. సంతోష్, స్థానిక ఎస్సై రఘుపతిలు బస్టాండ్ ప్రాంతంలోని వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని డాక్యుమెంట్ లో పొందుపరిచిన సాక్షులను పిలిచి ఇది సరైన డాక్యుమెంటేనా..? లేదా నకిలీదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అవసరమైతే డాక్యుమెంట్లో పొందుపరిచిన వారి ఫింగర్ ప్రింట్లు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed