కేయూలో క‌బ్జా...హైకోర్టులో ఎదురుదెబ్బ

by srinivas |
కేయూలో క‌బ్జా...హైకోర్టులో ఎదురుదెబ్బ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఆక్రమ‌ణ‌ల‌కు గురైన కాక‌తీయ యూనివ‌ర్సిటీ భూముల లెక్క తేలుతోంది. ఆక్రమ‌ణ‌ల‌కు పాల్పడిందెవ‌రో గ‌తంలో కేయూ ల్యాండ్ క‌మిటీ రిపోర్టు అంద‌జేసిన విష‌యం తెలిసిందే. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేస్తున్న ల్యాండ్ స‌ర్వేలోనూ అవే విష‌యాలు నిర్ధార‌ణ అవుతున్నాయి. గ‌తంలో ల్యాండ్ క‌మిటీ 19 మంది కేయూ భూముల‌ను ఆక్రమించుకున్నారంటూ రిపోర్టు చేయ‌డంతో ఆ త‌ర్వాత 13 మందికి మున్సిపాలిటీ నుంచి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా అక్రమ నిర్మాణాల‌పై ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేదు. ఇన్​చార్జి వీసీ వాకాటి క‌రుణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల‌తో రిపోర్టు కావాల‌ని కోర‌డంతో తాజాగా ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించింది. దీంతో ఇటీవ‌ల కేయూ భూముల‌పై స‌ర్వేను ప్రారంభించిన విజిలెన్స్ టీం మూడు రోజుల పాటు ప‌లివేల్పుల‌, కుమార్ ప‌ల్లి, గుండ్ల సింగారంలోని కేయూ భూముల‌ను క్షేత్రస్థాయిలో ప‌రిశీల‌న చేసింది.


ఆ ఇళ్లకు మార్కింగ్‌.. రోడ్డు కూడా కేయూ ల్యాండ్‌లోనే..!

229 స‌ర్వే నెంబ‌ర్‌లోని గుండ్ల సింగారం వైపు ఉన్న కేయూ భూముల్లో అక్రమ నిర్మాణాలు జ‌రిగిన‌ట్లుగా నిర్ధార‌ణ చేసుకున్న విజిలెన్స్, రెవెన్యూ, మున్సిపాలిటి అధికారులు బుధ‌వారం ఈ మేర‌కు ల్యాండ్ మార్కింగ్ చేశారు. న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ పక్కన సర్వేనంబర్లో బుధ‌వారం అధికారుల బృందం సర్వే నిర్వహించింది. బీసీకాలనీలో కొన్ని ఇళ్లు వర్సిటీ భూమిలోనే నిర్మాణం జ‌రిగిన‌ట్లుగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఈ కాల‌నీకి వేసిన రోడ్డు సైతం వ‌ర్సిటీ ప‌రిధి భూమిలో ఉన్నట్లుగా గుర్తించ‌డం గ‌మ‌నార్హం. శుక్రవారం 214 స‌ర్వే నెంబ‌ర్‌లో స‌ర్వే చేప‌ట్టనున్నారు. ఈ రెండు స‌ర్వే నెంబ‌ర్లతో మ‌రో ఆరు స‌ర్వే నెంబ‌ర్లలోనే అధికారులు క్షేత్రస్థాయిలో ప‌రిశీల‌న చేయ‌నున్నారు. అయితే 229 స‌ర్వే నెంబ‌ర్‌లో గుర్తించిన అక్రమ నిర్మాణాల‌కు మాత్రం మున్సిప‌ల్ అధికారులు నోటీసులు జారీ చేసి సాధ్యమైనంత త్వర‌గా చ‌ర్యలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వస‌నీయంగా తెలిసింది.

హైకోర్టులో పిటిష‌న‌ర్లకు ఎదురుదెబ్బ

కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇటీవల రెవెన్యూ మరియు ల్యాండ్ సర్వే ఆఫీసు అధికారులతో కలిసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చేయించిన సర్వే రిపోర్టు ఆధారంగా వరంగల్ మున్సిపల్ ఆఫీసు అధికారులు కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు మిగితా వారి ఇంటి నెంబర్లను చూయిస్తూ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 254 కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది.

సెక్షన్ 254 కింద డిప్యూటీ కమిషనర్, కాజీపేట సర్కిల్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ సెప్టెంబర్ 2 న కేయూ పరిధిలోని భూముల ఆక్రమ‌ణ‌కు సంబంధించి బీసీ కాలనీ గుండ్ల సింగారం కుమారపల్లిలో ఉంటున్న కొంత మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 9 మంది హైకోర్టును ఆశ్రయించారు. గురువారం హైకోర్టులో వీరి అభ్యర్థనపై వారి న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపించారు. జీడ‌బ్ల్యూఎంసీ ఇచ్చిన నోటీసులకు ఇదే నెల 5న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిష‌న‌ర్లు కోరారు. సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి చ‌ర్యలు జీడ‌బ్ల్యూఎంసీ తీసుకోవ‌ద్దని ఉత్తర్వులు వెలువరించాలని హైకోర్టును 9 మంది పిటిష‌న‌ర్లు కోరారు. అయితే గ‌తంలో చేసిన స‌ర్వే, విజిలెన్స్ స‌ర్వే అనంత‌రం త‌ద‌నుగుణంగా వ‌రంగ‌ల్ మున్సిపాలిటీ అధికారులు చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించింది. పిటిష‌న‌ర్లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయాలేమ‌ని హైకోర్టు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. హైకోర్టుకు వెళ్లిన పిటిష‌న‌ర్లకు ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లయింది.

Advertisement

Next Story

Most Viewed