- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నరకప్రాయం ఆ రహదారి..! పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు
దిశ, మంగపేట: ఓ పాంత అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైనది. ఆ ప్రాంతం అభివృద్ధి అక్కడి రహదారులను చూస్తే అర్థమవుతుంది. ప్రజల జీవన వ్యవస్థలో రహదారుల పాత్ర ముఖ్య భూమిక. మానవుడి గమ్య స్థానం ఏదైనా జీవనయానం రోడ్డు లేకుండా ముందుకు సాగదనేది జగమెరిగిన సత్యం. అంత ప్రాధాన్యత ఉన్న రోడ్లు మంగపేట మండలంలో అత్యంత దయనీయంగా మారాయి. మండల కేంద్రం నుంచి ఏటూరు నాగరం వరకు సుమారు 17 కి.మీ ఆర్ అండ్ బీ రోడ్డు నరకప్రాయంగా మారింది. అడుగడుగునా గుంతలతో ప్రయాణికులకు చుక్కలు చూపుతూ.. ప్రాణ సంకటంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వెరసి రెండేళ్ల కింద టెండర్లు పూర్తయినా రోడ్డు పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారాయి. ఇది ఏటూరునాగారం-బూర్గంపహాడ్ డబుల్ లేన్ ప్రధాన రహదారి పరిస్థితి.
మండల పరిధిలోని రాజుపేట నుంచి మంగపేట మీదుగా ఏటూరు నాగారం వరకు సుమారు రూ.6 కోట్ల 50 లక్షలతో ‘రెనివల్ కోర్స్’ పనులను సాయిదత్త కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. రాజుపేట నుంచి మంగపేట వరకు అక్కడక్కడా పాడైన రోడ్డు పనులు చేసినప్పటికీ మంగపేట గౌరారం వాగు బ్రిడ్జీ నుంచి ఏటూరు నాగారం వరకు 60 శాతం పనులు పూర్తి చేయకుండానే చేతులెత్తేశారు. ఆర్ అండ్ బీ డీఈగా ఉన్న రఘువీర్ అనే అధికారికి సాయిదత్త కన్స్ట్రక్షన్స్‌లో వాటాలు ఉండడంతోనే రోడ్డు పనులు చేయకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారి రెనివల్ కోర్స్ పనులపై సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు బలం చేకూరుతోంది.
60 శాతం పనులు జరగకుండానే ఆర్ అండ్ బీ అధికారులు రూ.కోటికి పైగా నిధులు కాంట్రాక్టర్ వర్గాలకు ముందస్తు బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిత్యం అధిక బరువుతో ప్రయాణించే వందలాది ఇసుక లారీలు, భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై మీటరు లోతు గుంతలతో దర్శనమిస్తూ ప్రయాణం నరకప్రాయంగా మారినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంగపేట నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న ఏటూరు నాగరం వెళ్లేందుకు 10 నిమిషాల్లో ప్రయాణం కానీ, 45 నిమిషాల నుంచి గంట పడుతుందంటే ఆ రోడ్డుపై ప్రయాణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆపద సమయంలో అంతే సంగతులు..
అత్యవసర రోడ్డు ప్రమాద సమయాల్లో గర్భిణులు, వృద్ధులు అత్యవసర వైద్య సేవల కోసం వరంగల్, ములుగు, ఏటూరు నాగారంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుంటారు. ఆ గుంతల రోడ్డుపై ప్రయాణించి ఆసుపత్రికి చేరుకునే లోపే సరైన వైద్యం అందక జరగాల్సిన నష్టం జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జీవనోపాధి కోసం మంగపేట నుంచి ఏటూరు నాగరం ఆటోలు నడుపుకునే యజమానులు, డ్రైవర్లు, ద్విచక్ర వాహనాలపై కూలి పనులకు వెళ్లే కూలీలు గుంతలు పడిన రోడ్డుపై ప్రయాణం చేస్తూ తమకు వచ్చే ఆదాయం వాహనాలు రిపేర్లు చేయించుకోవడానికే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే స్పందించి మధ్యలోనే ఆగిపోయిన ‘రెనివల్ కోర్స్’ రోడ్డు పనులను ప్రారంభించాలని, పనులు ప్రారంభం అయ్యే లోపు అధికారులు తాత్కాలికంగా గుంతలను పూడ్చి వాహనదారులను, ప్రజలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టులో వాటాలు అబద్ధం.. డీఈ రఘువీర్, డీఈ, ఆర్ అండ్ బీ
రెనివల్ కోర్స్ రోడ్డు పనులు పొందిన సాయిదత్త కన్స్ట్రక్షన్స్‌లో తనకు వాటాలు ఉన్నాయని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అలాంటి అవసరం కూడా లేదని ఆర్ అండ్ బీ డీఈ రఘువీర్ అన్నారు. మంగపేట గౌరారం వాగు బ్రిడ్జీ నుంచి ఏటూరు నాగారం వరకు 78 నుంచి 85 కి.మీ పరిధిలో పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో పలుమార్లు సాయిదత్త కన్స్ట్రక్షన్స్ కాంట్రక్టర్లను మందలించడమే కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. టెండర్లు జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. రెనివల్ కోర్స్ పనులు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి మూడు రోజుల క్రితం ఆర్ అండ్ బీ ఈఈకి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సుమారు 5 నుంచి 6 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఆర్ అండ్ బీ డీఈగా పని చేసినందున కొందరు కాంట్రాక్టర్లు పనిగట్టుకుని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, వాటాలు తీసుకోవాల్సిన అవసరం తనకు కూడా లేదన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిలింగ్‌లో బదిలీ కావాల్సి ఉన్నా కాలేదని డిసెంబర్, జనవరిలో జరిగే బదిలీల్లో వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.