జ‌న‌గామ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యుల ఇష్టారాజ్యం

by Mahesh |
జ‌న‌గామ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యుల ఇష్టారాజ్యం
X

దిశ, జనగామ: జనగామ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఘటనలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. నిరుపేద గర్భిణులకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (ఎంసీహెచ్‌)లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్రైవేట్‌లో వైద్యం ఆర్థిక భారంగా మారడంతో జనగామ జిల్లా నుంచే కాకుండా యాదాద్రి , సిద్దిపేట జిల్లాలకు చెందిన అనేక మంది గర్భిణులు ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తుంటారు. కానీ ప్రసూతి ఆస్పత్రుల వైద్యులు ప్రజలను పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఆస్పత్రిలో డెలివరీలు పెంచాలని ప్రచారం చేస్తున్నారు కానీ, ఆస్పత్రుల్లో సరిపడా వైద్యుల, సౌకర్యాలను పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది.

జనగామ జిల్లా తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రతిరోజూ జనగామ ఎంసీహెచ్ కు వందల సంఖ్యలో గర్భిణులు వస్తుంటారు. సేవలందించాల్సిన వైద్యులు గర్భిణులపై చిరాకు చెందడం పరిపాటిగా మారింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పేద ప్రజలు చాలా మంది చేతిలో డబ్బులు లేక గవర్నమెంట్ ఆసుపత్రిని నమ్ముకొని వస్తుంటారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ప్రవర్తనతో కలత చెంది అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడని వాపోతున్నారు. ఇక ఆదివారాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుంది. డ్యూటీ డాక్టర్లు లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎప్పుడు రద్దీగానే ..

పీహెచ్​సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టార్గెట్ కు మించి సాధారణ ప్రసవాలు చేస్తే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందుతాయి. మరోవైపు పీహెచ్​సీలో సరిపడా డాక్టర్లు, ఎక్విప్​మెంట్ సరిగా లేకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పీహెచ్​సీ డాక్టర్లు జనగామ ఎంసీహెచ్ కు పంపించి వైద్యం అందించే దిశగా ప్రోత్సహిస్తున్నారు. గర్భిణులతో ఆస్పత్రి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులు..

మా బిడ్డకు జనగామ ఎంసీహెచ్ లో వైద్యం కోసం వస్తే ఈ జిల్లా కాదని, సొంత జిల్లాకే వెళ్లి చూపించాలని, ఇంకోసారి వస్తే బాగుండదని వైద్యులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. నాది జనగామ జిల్లానే నాకు దగ్గర ఉన్న ఆస్పత్రిలోనే చూపిస్తాం కానీ, వేరే జిల్లాలో ఎలా చూపిస్తామని చెప్పినా వినలేదు. గర్భిణీ అని చూడకుండా నా బిడ్డను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధేసింది. –బత్తిని లలిత, బాధితురాలి తల్లి

సరిగా వైద్యం చేయలేదు..

మా కోడలికి ప్రసవం కోసం వస్తే సరిగా వైద్యం చేయలేదు. మా మనవరాలు ఆరోగ్యం క్షీణించడానికి కారణం అయ్యారు. ఇక్కడ పనిచేసే వైద్యులకు ఎమర్జెన్సీ విషయంలో సరిగ్గా స్పందించక పోవడం చాలా బాధాకరం. మా పాప జీవితం నాశనం చేశారు. –పన్నీరు సత్యనారాయణ, బాధితుడు

వైద్యుల కొరత వాస్తవమే..

జనగామ ఎంసీహెచ్​లో డాక్టర్లు కొరత ఉంది వాస్తవమే. అయినా అందరికీ వైద్యం అందించే విధంగా కృషి చేస్తున్నారు. పని ఒత్తిడిలో కొంత కఠినంగా మాట్లాడితే తప్పుగా భావించొచ్చు. రోగులు, గర్భిణులకు సరియైన వైద్యం అందించడంలో ముందుంటాం. – మధుసూదన్ రెడ్డి, ఎంసీ హెచ్ సూపరింటెండెంట్

Advertisement

Next Story

Most Viewed