ఎమ్మెల్యే విన‌య్ భాస్కర్ అనుచ‌రుడు వేముల అరెస్ట్ తప్పదా..?

by S Gopi |
ఎమ్మెల్యే విన‌య్ భాస్కర్ అనుచ‌రుడు వేముల అరెస్ట్ తప్పదా..?
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: జీడ‌బ్ల్యూఎంసీ 7వ డివిజ‌న్ కార్పొరేట‌ర్, ప్రభుత్వ చీఫ్‌విప్‌, ఎమ్మెల్యే విన‌య్ భాస్కర్ అనుచ‌రుడు వేముల శ్రీనివాస్‌పై మంగ‌ళ‌వారం రాత్రి హ‌న్మకొండ పీఎస్‌లో భూ క‌బ్జా య‌త్నం కింద కేసు న‌మోదైంది. ప్రైవేటు ల్యాండు మీద‌కు వెళ్లి బాధితుల‌ను భ‌యబ్రాంతుల‌కు గురి చేసిన ఘ‌ట‌న‌లో కార్పొరేట‌ర్‌, ఆయ‌న అనుచ‌రుల‌పై 506, 447, 427 సెక్షన్ల కింద హ‌న్మకొండ పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. హ‌న్మకొండ‌లోని కేయూ మొదటిగేటు ప్రాంతంలో నివాస‌ముంటున్న ఎన్. సునీత అనే మహిళ 2010లో పెద్దమ్మగడ్డ ప్రాంతం కాకతీయ కాలనీలో 2100 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. కొద్దికాలం త‌ర్వాత అందులో 1500 చదరపు గజాల స్థలాన్ని కొంత‌మందికి విక్రయించింది. మిగతా 600 గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకునేందుకు కొద్దికాలం క్రితం జీడబ్ల్యుఎంసీ నుంచి అనుమతులకు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ భూమిపై కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ క‌న్నేసిన‌ట్లుగా బాధితులు వెల్లడిస్తున్నారు. 600 గ‌జాల భూమిని త‌క్కువ ధ‌ర‌కు త‌న‌కే విక్రయించాల‌ని య‌జ‌మానులైన సునీత దంప‌తుల‌ను ప‌లుమార్లు బెదిరింపుల‌కు పాల్పడ్డాడు. ఓసారి సునీత దంపతులను మధ్యవర్తులతో ఇంటికి సైతం పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

అయితే సునీత దంప‌తులు ప్రాణంపోయినా భూమిని అమ్మే ప్రస‌క్తే లేద‌ని చెప్పడంతో కార్పొరేటర్ తన పలుకుబడితో వేరే సర్వే నెంబర్ ఉన్న భూమి పత్రాలు చూపుతూ ఇదే ఆ భూమి త‌న‌దని, 2022లో తాను కొనుగోలు చేశానని కొద్దిరోజుల క్రితం కొంత‌మంది అనుచ‌రుల‌తో సైట్‌మీద‌కు వెళ్లి హంగామా చేశాడు. దీంతో భ‌య‌ప‌డిన బాధితులు స్థలం చుట్టూ ప్రహారీ నిర్మాణం కూడా చేసుకున్నారు. అయితే కార్పొరేటర్ శ్రీనివాస్ ఈ నెల 13న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తుల సాయంతో ప్రహారీని కూల్చేయ‌డంతో బాధితురాలు మర్నాడు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మూడురోజుల పాటు పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఇరు వర్గాల వద్ద ఉన్న భూమి పత్రాలను పూర్తిగా పరిశీలించారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో బాధితుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నట్లుగా నిర్ధారించుకున్న పోలీసులు కార్పొరేటర్‌, దౌర్జన్యానికి పాల్పడినవారిపై ఐపీసీ 506, 427, 447 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కార్పొరేట‌ర్ వెనుక కీల‌క‌ ప్రజాప్రతినిధి..?

బిల్డర్‌గా వేముల శ్రీనివాస్ అనేక వివాదాల్లో నానుతున్నారు. గ‌తంలో కుడా కాంప్లెక్స్ విష‌యంలోనూ అక్రమంగా ద‌క్కించుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. వేముల శ్రీనివాస్ అనేక భూ వివాదాల్లోనూ త‌ల‌దూర్చుతూ ఆక్రమ‌ణ‌ల‌కు య‌త్నించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వేముల శ్రీనివాస్ భూ క‌బ్జాల బాగోతం వెనుక మ‌రో కీల‌క నేత ఉన్నట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. స‌ద‌రు ప్రజాప్రతినిధి ఆజ్ఞ లేనిదే.. శ్రీనివాస్ ముందడుగు వేయ‌డ‌న్న అభిప్రాయాన్ని కొంత‌మంది వ్యక్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. స్వయంగా సీపీనే భూ క‌బ్జాదారుల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టడంతో ఇలాంటి కేసుల్లో స్పష్టమైన పురోగ‌తి ఉంటుంద‌ని బాధితుల్లో భ‌రోసా క‌నిపిస్తుండ‌టం విశేషం.

Advertisement

Next Story

Most Viewed