ఐనవోలు జాతరపై చిన్నచూపు..

by Aamani |
ఐనవోలు జాతరపై చిన్నచూపు..
X

దిశ, వర్థన్నపేట : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని మల్లికార్జున స్వామి జాతరపై స్థానిక ప్రజాప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారు. ప్రతి ఏటా జాతర కి ముందు ముందస్తు ఏర్పాట్ల కోసం పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జాతరకు ముందస్తు ఏర్పాట్లు చేసేవారు. కానీ ఈ సంవత్సరం స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపకపోవడంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భక్తులు తమ మొక్కలు సమర్పించుకోవడం కోసం మూడు రోజులు లక్షలాదిమంది తరలివచ్చి దర్శించుకుంటారు.

ఈ నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులకు సరైన బస్సుల సౌకర్యం తో పాటు అసౌకర్యం కలగకుండా చూడాలంటే జాతరకు కోంత మేర బడ్జేట్ అవసరం.గత ప్రభుత్వ హయాంలో జాతర కోసం ప్రతి ఏటా కోంత మేర బడ్జెట్ కేటాయించి ఏర్పాట్లు చేసేవారు.ఈ నేపథ్యంలో ఆలయ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఆలయ అభివృద్ధి కుంటుపడిపోతుంది. స్థానికంగా ఉన్న టెస్కబ్ చైర్మన్ రవీందర్ రావు ఉత్సవ ఏర్పాట్లు పై శ్రద్ధ చూపకపోవడం గమనార్హం..,ఆలయ కమిటీ ఏర్పాటు లో రవీందర్ రావు హస్తం ఉండటం వలనే ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే..

రాష్ట్రంలో పేరుగాంచిన ఐలోని మల్లన్న జాతర పై స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు.గతంలో ప్రతి ఏటా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమిక్షా సమావేశం ఏర్పాటు చేసి పలు శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించేవారు.ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు కలిసి గతంలో సీఎంకు జాతర కి రావాలని ఆహ్వానించేవారు .కానీ స్థానిక ఎమ్మెల్యే జాతరకు సరిపడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించక పోవడం వలనే సమీక్షా సమావేశం ఏర్పాటు చేయలేకపోతున్నరనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గత జాతరలో ఇబ్బందులు పడ్డ భక్తులు..

ఐలోని మల్లన్న గత సంవత్సరం జాతరలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సంక్రాంతి ప్రారంభమై ఉగాది వరకు అంగరంగ వైభవంగా జరిగే జాతరకు భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా మరుగుదొడ్లు ,త్రాగునీరు సరిపడా లేకపోవడం పారిశుద్ద్య లోపం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో వచ్చిన భక్తుల కంటే ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు జాతర పట్ల శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం జాతరకు కొద్ది రోజుల ముందు నుండే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేసేవారు.

సమీక్ష సమావేశం ఆలయ కమిటీ ఏర్పాటు లో జాప్యం..

ఐలోని మల్లన్న ఆలయ కమిటీ ఏర్పాట్లు జాప్యం జరుగుతుంది. జాతర కొద్దిరోజుల ముందే ఆలయ కమిటీని ఏర్పాటు చేసి వీరి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసేవారు.ఆలయ కమిటి ఏర్పాటు స్థానిక ఎమ్మెల్యే చేతుల్లో ఉంటుంది.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆలయ కమిటిని ఏర్పాటు చేయకుండా జాతరను ఎలా నడిపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జాతర సమయంలో ఆలయ కమిటీ లో ఉన్న సభ్యులందరూ విఐపి లకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక దర్శనం చేపించడంలో ప్రేక్షక పాత్ర పోషిస్తారు. కానీ ఇప్పటివరకు ఆలయ కమిటీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

Advertisement

Next Story