- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూపాలపల్లిలో రియల్ నాటకం!
దిశ, వరంగల్ బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రియల్‌దందా జోరుగా సాగుతోంది. హన్మకొండ, భూపాలపల్లి జాతీయ రహదారికి ఇరువైపులా పదుల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. అనుమతి లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. రియల్‌వ్యాపారుల మోసాలపై పలు సార్లు దిశ ఆధారాలతో సహా కథనాలు ప్రచురించింది. సదరు సర్వేనంబర్లను కూడా ఆ కథనాల్లో పేర్కొంది. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కమిషనర్ నిర్లక్ష్యాన్ని సైతం ఎండగట్టింది. అక్రమ వెంచర్లపై పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేయాల్సి ఉండగా అధికారులు ఆయా వెంచర్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
నాన్లేఅవుట్వెంచర్లు ఏర్పాటు చేస్తే సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. వెంచర్‌లో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు, ప్రచార బోర్డులను తొలగించాలి. కానీ, అధికారుల అలసత్వం, అవినీతితోనే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 30కిపైగా అనుమతి లేని వెంచర్లను గుర్తించినట్లుగా స్వయంగా కమిషనర్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికైనా రియల్మోసాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘నువ్వు కొట్టినట్టు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా’ అన్న చందంగా ఉంది భూపాలపల్లిలో మున్సిపాలిటీ అధికారులు, రియల్ ఎస్టేట్ నిర్వాహకుల తీరు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న అనుమతి లేని వెంచర్లు వెలుస్తున్నాయి. హన్మకొండ, భూపాలపల్లి జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో వెంచర్లు వెలిసాయి. మూడు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో అనుమతి లేని వెంచర్లు వెలుస్తున్నాయి. దీనిపై గతంలోనే దిశ ఆధారాలతో సహా కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే. అయితే భూపాలపల్లి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కమిషనర్ పూర్తి నిర్లక్ష్యంతోనే అనుమతి లేని వెంచర్ల దందా విస్తరిస్తోందని కూడా కథనాల్లో ఎండగట్టింది.
అమ్ముకునే దాక ఆగుతాం అన్న రీతిలో వెంచర్ల సర్వే నెంబర్లతో సహా కథనాల్లో పేర్కొన్నా చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత కొద్దిరోజులకు రియల్ ఎస్టేట్ నిర్వాహకులకు సానుకూల వాతావరణం ఏర్పడ్డాక, వారికి ఇబ్బంది కలిగించని రీతిలో వెంచర్లలో కేవలం రాళ్ల తొలగింపు చేపట్టడం గమనార్హం. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని బోర్డులు ఏర్పాటు చేసి మమ అనిపించారు.
తప్పంతా అధికారులదే..
నాలా కన్వర్షన్ లేకుండా, 10శాతం భూమిని సామాజిక స్థలాలకు వదలకుండా ఇష్టారాజ్యంగా ప్లాట్లుగా చేసి అమ్ముతున్నా మున్సిపాలిటీ అధికారులు వేడుక చూస్తున్నారు. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దని చెప్పడం వరకే ఆగుతున్న అధికారులు, దందా సాగిస్తున్న వారిపై చీటింగ్ కేసుల నమోదుకు మాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో రియల్టర్లతో మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటకాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైసాపైసా కూడబెట్టుకుని మరీ జిల్లా కేంద్రంలో ఓ స్థిర నివాసం ఉండాలనే ఆశతో ఇంటి స్థలం కొనుగోలుకు ముందుకు వస్తున్నారు.
అయితే లే అవుట్, నాన్ లే అవుట్ వెంచర్లపై అవగాహన లేక కొంతమంది, తక్కువ ధరకు వస్తుందని చెప్పి మరికొంతమంది, పర్మిషన్లు రావన్న నిజం తెలియక ఇంకొంతమంది రియల్ వ్యాపారుల నాటకాలకు బోల్తా పడుతున్నారు. రియల్టర్లపై కఠినంగా వ్యవహరించకపోవడమే వారి ఆగడాలు పెచ్చు మీరిపోవడానికి ప్రధాన కారణమవుతోందని చెప్పాలి. చర్యలు తీసుకునే అధికారం ఉన్నా అధికారులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా కూడా అధికారుల వైపే కనిపిస్తుండటం గమనార్హం.
ఎందుకు ధ్వంసం చేయరు..!
అనుమతి లేని వెంచర్లలో హద్దు రాళ్లను తొలగించడంతోనే పని పూర్తయిందన్నట్లుగా మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. అక్రమ వెంచర్ల ప్రహరీ నిర్మాణాలను, రోడ్లను ధ్వంసం చేయకుండా వదిలేస్తున్నారు. దీంతో తొలగించిన ప్లాట్ల హద్దు రాళ్లను రోజుల వ్యవధిలోనే తిరిగి ఏర్పాటు చేసి ఎప్పటిలాగే దందా సాగిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడే అధికారులు, రియల్టర్లు కలిసి రియల్ నాటకమాడుతున్నారు. చర్యలు తీసుకున్నట్లే.. దందా ఆగనట్లే అన్న చందంగా భూపాలపల్లిలో అనుమతి లేని స్థిరాస్థి వ్యాపారం జరుగుతోంది.
అధికారులది ఆత్మ వంచన కాదా..?
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 30కిపైగా అనుమతి లేని వెంచర్లను గుర్తించినట్లుగా గతంలో స్వయంగా కమిషనర్ ప్రకటించారు. ఈ వెంచర్లపై నామ మాత్రపు దాడులు చేసి వదిలేసిన అధికారులు, సదరు వెంచర్లకు సంబంధించిన సర్వే నెంబర్లతో గుంట, రెండు గుంటల భూములు రిజిస్ట్రేషన్ కాకుండా కలెక్టర్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఇక పొలం భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్న విషయం తెలిసి కూడా తహసీల్దార్‌కు తెలిసే రిజిస్ట్రేషన్ జరుగుతున్నా శాఖ పరంగా సదరు అధికారిపై చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం వెంచర్‌లో కొద్ది మేర స్థలానికే నాలా కన్వర్షన్ చేసుకుని ఎకరాల కొద్ది రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు మరికొంతమంది.
పొలం భూముల మాటున తహసీల్దార్ కార్యాలయంలో, నాలా కన్వర్షన్ జరిగిందనే పేరుతో ఎకరాల కొద్ది విస్తీర్ణంలోని నాన్ లే అవుట్ వెంచర్ల స్థలాలు దర్జాగా ములుగు రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. మున్సిపాలిటీ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు సంయుక్తంగా దందాకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. తప్పులన్నీ తమ దగ్గరే పెట్టుకుని నాన్ లే అవుట్ దందా ఆపాలంటూ నెత్తినోరు కొట్టుకున్న చందంగా ప్రకటనలు చేయడం ఆత్మవంచన కాకుండా ఇంకేమవుతుందో భూపాలపల్లి కలెక్టర్, కమిషనర్, టౌన్ ప్లానింగ్, తహసీల్దార్, ములుగు సబ్ రిజిస్ట్రార్‌కే తెలియాలంటూ జనం మండిపడుతున్నారు.