ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండిః కలెక్టర్ రాహుల్ శర్మ

by Nagam Mallesh |
ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండిః కలెక్టర్ రాహుల్ శర్మ
X

దిశ, కాటారం : జిల్లాలోని గోదావరి తీర ప్రాంత గ్రామాల ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. సోమవారం మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముంపు ప్రాంతమైన పుసుకుపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నదని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎగువ ప్రాంతాలలో వర్షం కురిస్తే గోదావరి ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉంటుందని, ముంపు ప్రాంతల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు తెలియ పరచాలని అన్నారు. గోదావరిలోకి స్నానాలు ఆచరించేందుకు భక్తులను అనుమతించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రాథోడ్ ప్రహ్లాద్, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ సూర్య ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, సిడబ్ల్యుసి సైట్ ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed