అందుకే డేవిస్ కప్ నుంచి తప్పుకున్నా : సుమిత్

by Harish |
అందుకే డేవిస్ కప్ నుంచి తప్పుకున్నా : సుమిత్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీ డేవిస్ కప్‌లో స్వీడన్ చేతిలో భారత్ ఘోర పరాజయం అనంతరం ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఈ టోర్నీకి గైర్హాజరైన భారత స్టార్ ప్లేయర్లపై విమర్శలు గుప్పించింది. సుమిత్ నగాల్, యుకీ బాంబ్రీ, ముకుంద్ శశికుమార్‌ లాంటి ఆటగాళ్లు దేశానికి ఆడకుండా ఇతర టోర్నీల్లో పాల్గొంటున్నారని ఫైర్ అయ్యింది. ఏఐటీఏ ఆరోపణలపై తాజాగా సుమిత్ నగాల్ స్పందించాడు. గురువారం సోషల్ మీడియా వేదికగా డేవిస్ కప్ నుంచి తప్పుకోవడంపై వివరణ ఇచ్చాడు.

గాయం కారణంగానే డేవిస్ కప్ ఆడలేకపోయానని తెలిపాడు. ‘దేశానికి ఆడటం ఎల్లప్పుడూ నాకు అత్యున్నత గౌరవం. జాతీయ జట్టుకు ఆడటాన్ని ఎంతో ఆరాధిస్తాను. డేవిస్ కప్ నుంచి తప్పుకోవడం నాకు చాలా కఠిన నిర్ణయం. మెడికల్ టీమ్‌ను సంప్రదించిన తర్వాత గాయంతో పోటీపడటం నా ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా జట్టు విజయవకాశాలపై ప్రభావం చూపుతుందని అర్థమైంది. అందుకే, నా స్థానంలో మరొకరు ఆడితే జట్టుకు మంచిదని భావించాను. నా గైర్హాజరీని ఏఐటీఏకు ముందే చెప్పాను.’ అని రాసుకొచ్చాడు.

అలాగే, దేశానికి ఆడటానికి పరిహారం అడిగినట్టు ఏఐటీఏ సెక్రెటరీ అనిల్ ధూపర్‌ వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా అథ్లెట్లకు పరిహారం చెల్లించడం ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లో ప్రామాణిక పద్ధతి అని చెప్పాలనుకుంటున్నా. ఇది వ్యక్తిగత లాభం గురించి కాదు.ఏఐటీఏ, డేవిస్ కప్ కెప్టెన్‌తో నా చర్చలో గోప్యమైనవి. దీనిపై ఎలాంటి ఊహాగానాలకు తావివ్వడం నాకు ఇష్టం లేదు. నా దేశానికి నేను కట్టుబడి ఉన్నాను. నేను ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారి నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటా. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కోసం ఎదురుచూస్తుంటా.’ అని రాసుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed