ఏసీబీ వలలో శివునిపల్లి పంచాయతీ కార్యదర్శి

by S Gopi |
ఏసీబీ వలలో శివునిపల్లి పంచాయతీ కార్యదర్శి
X

దిశ, జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కుర్ర చిరంజీవి గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుండి రూ. 50,000 లంచంగా తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ అధికారులు మధ్యాహ్నం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శివునిపల్లిలో గత సంవత్సరం రూ. 26 లక్షల సీసీ రోడ్డు పనులు మంజూరు అయ్యాయి. వీటిని స్థానిక ప్రజాప్రతినిధి సబ్ కాంట్రాక్టర్ కు ఇచ్చాడు. పనులను సబ్ కాంట్రాక్టు తీసుకున్న శివరాత్రి కొమురయ్య సదరు పనులు అన్ని పూర్తి చేశాడు. వాటి తాలూకు బిల్లులు చేయాలని గ్రామ పంచాయతీ చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాడు.

అయితే, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి రూ.1.20 లక్షలు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఒక్క బిల్లు కూడా చేయనని బెదిరించాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ మూడు నెలల క్రితం కార్యదర్శికి రూ. 15000 ముట్ట చెప్పాడు. ఇందులో భాగంగా గురువారం రూ.50 వేలు ఇవ్వగా అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే డబ్బులు తీసుకున్న కార్యదర్శి అనుమానం వచ్చి వాటిని జీపీ కార్యాలయంలో వదిలేసి వెళుతుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపాడు. ఇటీవల కాలంలో జనగామ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఏసీబీకి చిక్కడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులపై దృష్టి సారించి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story