వ‌రంగ‌ల్ జిల్లా BRS ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్‌.. ఆ ఐదు నియోజకవర్గాలపై కామ్రేడ్ల కన్ను..!!

by Satheesh |   ( Updated:2023-01-14 13:24:36.0  )
వ‌రంగ‌ల్ జిల్లా BRS ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్‌.. ఆ ఐదు నియోజకవర్గాలపై కామ్రేడ్ల కన్ను..!!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: జాతీయ రాజ‌కీయాల్లో ముందుడుగు వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వామ‌ప‌క్షాల‌ను క‌లుపుకెళ్లాల‌ని భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మౌఖికంగా చ‌ర్చలు జ‌రిపిన కామ్రేడ్లు సైతం పొత్తుకు ఉత్సాహం చూపుతున్నట్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. మునుగోడులో మ‌ద్దతు తెలిపిన కామ్రేడ్లు అధికార పార్టీ అభ్యర్థి విజ‌యంలో కీల‌క పాత్ర వ‌హించిన‌ట్లుగా రెండు పార్టీల్లోనూ విశ్లేష‌ణ జ‌రుగుతోంది. జాతీయ రాజ‌కీయాల్లో పార్టీ బ‌లోపేతానికి, ఎన్నిక‌ల్లో ప్రభావంత‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకోవ‌డానికి దోహ‌దం చేస్తార‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు స‌మాచారం. ఇది జాతీయ రాజ‌కీయాల్లో బాగానే ఉన్నా.. కామ్రేడ్ల రాజ‌కీయ కోరిక‌లు, డిమాండ్లు ఏ అధికార పార్టీ సిట్టింగ్ స్థానానికి, నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావ‌హుల ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేయ‌నున్నాయోన‌న్న టెన్షన్ ఆ పార్టీ నేత‌ల్లో నెల‌కొంది.

గుడిసెల ఉద్యమంతో ఫాంలోకి కామ్రేడ్లు..!

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వామ‌ప‌క్షాలు ఆ త‌ర్వాత కాలంలో ప్రాభ‌వం కోల్పోతూ వ‌చ్చాయి. ప్రస్తుతం ఉనికి చాటుకునే ప్రయ‌త్నాల‌ను కొన‌సాగిస్తున్నాయి. ఈక్రమంలోనే జాతీయ రాజ‌కీయాల‌ను టార్గెట్ చేస్తూ ఎక్కువ‌గా, రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు నెర‌వేర్చాల‌ని గ‌త కొంత‌కాలంగా యాక్టివ్‌గా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌డుతున్నాయి. ఇక గుడిసెవాసుల‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాల‌నే డిమాండ్‌తో గ‌త నాలుగైదు నెల‌లుగా చెరువులు, కుంట‌లు, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలను పేద ప్రజ‌ల‌తో క‌లిసి వేస్తున్నారు. ఈ గుడిసెల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం, సీపీఐ పార్టీల‌ను ఖ‌చ్చితంగా ఉనికిలోకి తీసుకువ‌చ్చింద‌నే చెప్పాలి.

అయితే ఈ ఉద్యమానికి వ‌రంగ‌ల్‌లోన పునాది ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఉమ్మడి వ‌రంగ‌ల్‌జిల్లాలో వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, మ‌హ‌బూబాబాద్‌, జ‌న‌గామ‌తో పాటు ఇంకా అనేక ప‌ట్టణాలతో పాటు మేజ‌ర్ గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాల్లో గుడిసెల నిర్మాణం జ‌రుగుతోంది. ఈ ఉద్యమానికి పేద ప్రజానీకం నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావ‌డంతో కామ్రేడ్లు వెన‌క్కి త‌గ్గడం లేదు. రెవెన్యూ, పోలీసుల చ‌ర్యల‌ను సైతం ధీటుగా ఎదుర్కొంటుండ‌టం గ‌మనార్హం. స‌మీప భ‌విష్యత్‌లోనే ఎన్నిక‌లు ఉండ‌టంతో కామ్రేడ్ల ఉద్యమం ఏ స్థాయిలో త‌మ మీద‌కు మ‌ళ్లుతుందోన‌న్న భ‌యాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఆ సీట్లపై కామ్రేడ్ల క‌న్ను..!

వామ‌ప‌క్షాల‌కు కొన్ని వ‌ర్గాల నుంచి మంచి మ‌ద్దతు ఉంద‌ని, అయితే వారిని పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకోవ‌డంలో మాత్రం వైఫ‌ల్యం జ‌రుగుతోంద‌న్న అభిప్రాయాన్ని వామ‌ప‌క్షాల‌కు చెందిన సీనియ‌ర్ నేత‌లే అభిప్రాయం వ్యక్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న ప‌రిణామాల‌ను, పొత్తుల రాజ‌కీయ ప్రక్రియ‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి వెళ్లాల‌ని కూడా యోచిస్తున్నట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే జాతీయ రాజ‌కీయాల్లో బీఆర్ ఎస్ అవ‌స‌రాన్ని దృష్టిలో ఉంచుకుని కాసింత గ‌ట్టి డిమాండ్లనే తెర‌పైకి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా విష‌యానికి వ‌స్తే మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, న‌ర్సంపేట‌, జిల్లాలో పాక్షిక నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న హుస్నాబాద్‌, మ‌రో పాక్షిక నియోజ‌క‌వ‌ర్గం ఇల్లందుపైనా క‌న్నేసిన‌ట్లుగా తెలుస్తోంది.

మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టణంలో కాసింత స్థిర‌మైన ఓటుబ్యాంకును వామ‌ప‌క్షాలు క‌లిగి ఉండ‌గా, వ‌రంగ‌ల్ తూర్పులోనూ ఉనికిలో ఉన్నారు. గడిచిన కొద్దికాలంగా న‌ర్సంపేటలోనూ ఉనికి చాటుకునేంందుకు ప్రయ‌త్నం చేస్తున్నారు. ఒక‌ప్పటి వామ‌ప‌క్షాల కంచుకోట‌గా వ‌ర్ధిల్లిన ఇల్లందు, హుస్నాబాద్‌ల‌పైనా కామ్రేడ్లు ఆశ‌లు పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం నేత‌లు ఒక్కో సీటైనా కావాల‌ని గ‌ట్టి డిమాండ్‌ను బీఆర్ఎస్ ముందు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ సీట్లను వ‌దులుకోవ‌డానికి కేసీఆర్ ఒప్పుకుంటారా? జాతీయ రాజ‌కీయాల కోసం ఏ ఎమ్మెల్యేకు ఎస‌రు పెడుతారు..? పొత్తుల ఎత్తుల్లో ఎవ‌రు చిత్తుకాబోతున్నారు..? పార్టీ త్యాగాల‌కు ఎవ‌రు స‌మిధ కాబోతున్నారు..? అనేది స‌మీప భ‌విష్యత్తే స‌మాధానం చెప్పనుంది.

Advertisement

Next Story

Most Viewed