వరంగ‌ల్‌లో ఐదుగురు ఎమ్మెల్యేల న‌యా స్ట్రాట‌జీ!

by Hamsa |
వరంగ‌ల్‌లో ఐదుగురు ఎమ్మెల్యేల న‌యా స్ట్రాట‌జీ!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్రమైన వ్యతిరేక‌త ఉంద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అల‌ర్ట్​ అయ్యారు. మ‌ళ్లీ టికెట్ కోసం పోరాడాల‌న్నా జ‌న‌బ‌లమెంతుందోన‌ని తెలుసుకునేందుకు సొంతగా స‌ర్వేలు చేయించుకుంటున్నారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో 12 సంపూర్ణ నియోజ‌క‌వ‌ర్గాల్లో ములుగులో సీత‌క్క మిన‌హా మిగిలిన‌వారంతా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే కావ‌డం గ‌మ‌నార్హం. 11 మందిలో 8 మంది ఎమ్మెల్యేల‌పైనా తీవ్రమైన ప్రజా వ్యతిరేక‌త ఉంద‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొని ఉంది. ప్రస్తుతం 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ముగ్గురి నుంచి న‌లుగురి అవ‌స‌ర‌మైతే ఐదుగురిని కూడా మార్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతుండటం గ‌మ‌నార్హం. అధినేత కేసీఆర్ సైతం ఇదే విష‌యాన్ని విస్పష్టంగా ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలోనూ వెల్లడించారు. ఈ నేప‌థ్యంలోనే ఓరుగ‌ల్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అల‌ర్ట్​అయ్యారు.

మీ ఎమ్మెల్యేకు ఓటేస్తారా..?

నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజాబ‌లం, పార్టీబ‌లం ఎంతో తెలుసుకునేందుకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సొంతగా స‌ర్వేలు చేయించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దిశ‌కు అందిన స‌మాచారం ప్రకారం.. బీఆర్ఎస్ ప్రభుత్వ పాల‌న ఎలా ఉంది..?, ప్రభుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయా..?, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?

మీ ఎమ్మెల్యే ప‌నితీరు ఎలా ఉంది..?, మీకు అందుబాటులో ఉంటున్నాడా..?, సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా వేరే నేత‌యితే ఎవ‌రికి ఓటేస్తారు..? అంటూ నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ వ‌ర్గాల ప్రజానీకం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏజెన్సీల ద్వారా స‌ర్వే నిర్వహిస్తున్నట్లు స‌మాచారం. ప‌బ్లిక్ ప‌ల్స్‌ను ప‌ట్టుకునేందుకు, స‌ర్వే ఆధారంగా త‌మ స్ట్రాట‌జీని సిద్ధం చేసుకునేందుకు దోహ‌దం చేస్తుంద‌ని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారంట‌. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌తో పాటు టికెట్ ఆశిస్తున్న బీఆర్ ఎస్ నేత‌లు కూడా స‌ర్వేలు చేయించుకుంటున్నట్లుగా అధికార పార్టీలో టాక్ న‌డుస్తోంది.

సొంత స‌ర్వేల‌కు ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు..!

దిశ‌కు విశ్వస‌నీయంగా తెలిసిన స‌మాచారం ప్రకారం.. ఎప్పుడూ భూ వివాదాల్లో, పార్టీలో వ‌ర్గ రాజ‌కీయాన్ని పాటిస్తున్న నేత‌గా అధిష్టానం దృష్టిలో ప‌డి, టికెట్‌పై దింపుడుగ‌ల్లం ఆశ‌ల‌ను పెట్టుకున్న ఓ ఎమ్మెల్యే సొంతగా స‌ర్వే చేయించుకుంటున్నార‌ని స‌మాచారం. అలాగే గ‌తంలో ఓ వ‌ర్గం ప్రజానీకాన్ని కించ‌ప‌రుస్తూ మాట్లాడి త‌ద‌నంనంత‌ర ప‌రిణామాల‌తో నాలుక‌ర్చుకుని వివ‌ర‌ణ ఇచ్చుకున్న ఎమ్మెల్యే సైతం ఉన్నట్లు తెలిసింది. ఇక కేటీఆర్ స‌భ ద్వారా తానే ఎమ్మెల్యే బ‌రిలో ఉండేదంటూ చాటుకునే ప్రయ‌త్నం చేసి, సొంత పార్టీలోనే భారీ వ్యతిరేక‌త‌ను చాటుకుని, ప్రతిప‌క్షం గెలుపు ఈజీ చేయ‌బోతున్నార‌నే ప్రచారంలో ఉన్న మ‌రో ఎమ్మెల్యే ఉండ‌డం గ‌మ‌నార్హం. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లంగా ఉన్నా, సెటిల్‌మెంట్లు, భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు విరివిగా ఉన్న మ‌రో ఎమ్మెల్యే కూడా స‌ర్వే చేయించుకుంటున్నారు. స‌ద‌రు ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ నుంచి టికెట్ పోరు ఉంటుంద‌న్న ప్రచారం నేప‌థ్యంలో తన బ‌ల‌మేంటో తెలుసుకుని అధిష్టానం వ‌ద్ద పోరాటం మొద‌లెట్టాల‌ని చూస్తున్నారని తెలిసింది. ఇక ఉద్యమ కాలం నుంచి ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని శాసిస్తున్న ఓ ఎమ్మెల్యే కొద్దికాలంగా వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని, టికెట్ కూడా డౌటేనంటూ, ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను చిత్తు చేయ‌డంతో వారంతా స‌ద‌రు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు ఉద్యమ నేత‌, ఎమ్మెల్యే సైతం స‌ర్వే చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

గ‌తంలోనే అధినేత కేసీఆర్ నుంచి హెచ్చరికలు..!

అధినేత కేసీఆర్ గ‌తంలో తాను చేయించిన స‌ర్వేల్లో, పీకే స‌ర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రజా వ్యతిరేక‌త ఉంద‌ని తేలిన ఎమ్మెల్యేల‌ను ప‌రిస్థితిని మార్చుకోవాల‌ని సూచించిన‌ట్లుగా వార్తలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గర ప‌డుతున్న నేప‌థ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోసారి ఎమ్మెల్యేలపై స‌ర్వే చేయిస్తున్నట్లు నేత‌ల ద్వారా తెలుస్తోంది. అయితే కేసీఆర్ స్వయంగా చేయించిన సర్వే, పీకే రిపోర్టులో ఎక్కువ‌గా నెగ‌టివ్ మార్కులు ప‌డిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆందోళ‌న‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. జ‌నబ‌ల‌మెంతో తెలిస్తే దాన్ని బ‌ట్టి రాజ‌కీయ ప‌రిస్థితులను బేరీజు వేసుకుని ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధం కావ‌చ్చనే ఆలోచ‌న‌తో ఉన్నట్లు భావిస్తున్నట్లు స‌మాచారం. వాస్తవానికి స‌ద‌రు ఐదుగురు ఎమ్మెల్యేలు నెల‌వారీగా స‌ర్వే రిపోర్టుల‌ను తెప్పించుకుంటున్నార‌ని స‌మాచారం. స‌ర్వే రిపోర్టులను బ‌హిర్గతం చేయ‌డానికి వీల్లేకున్నా, త‌మ స్ట్రాట‌జీని రూపొందించుకోవ‌డానికి దోహదం చేస్తాయ‌ని భావిస్తున్నారంట‌.

Advertisement

Next Story