- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ములుగులో మట్టి దొంగలు.. మైనింగ్‌ను తలపించే మట్టి క్వారీలు
ములుగు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా మైనింగ్‌ని తలపించేలా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి తరలిస్తుంది. వందల సంఖ్యల మట్టి టిప్పర్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ములుగు జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని జంగాలపల్లి గ్రామ శివారులోని నిర్మానుష ప్రాంతాలు, కొండల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రకృతి సంపదను కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి దందాతో కోట్లకు పడగలెత్తారంటే ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
బండారుపల్లి గ్రామ శివారులోని బోడు గుట్టను మట్టి వ్యాపారుల బొందల గడ్డగా మార్చారు. జంగాలపల్లి ఎర్ర గట్టమ్మ వద్ద గత రెండేళ్లలో శాటిలైట్ఇమేజ్ను పరిశీలిస్తే 10 ఎకరాల్లో మట్టిని మాయం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ పనులకు తరలిస్తున్నామని, అన్ని అనుమతులు ఉన్నాయని నమ్మబలుకుతున్నట్లు తెలిసింది.
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో అక్రమంగా మట్టిని తవ్వుతూ నిత్యం టిప్పర్ల ద్వారా రవాణా చేస్తూ కొందరు అక్రమార్కులు రూ.కోట్లకు పడగెత్తారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో మట్టి క్వారీలను ఏర్పాటు చేసి పట్టపగలు బహిరంగంగానే మైనింగ్ ని తలపించేలా తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని జంగాలపల్లి గ్రామ శివారులోని నిర్మానుష ప్రాంతాలు, కొండల్లో మట్టి తవ్వకాలు చేపట్టి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పగలు, రాత్రి వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
మైనింగ్‌ను తలపించేలా తవ్వకాలు..
ములుగు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో మట్టి తోడడానికి అనువుగా ఉన్న, నిర్మానుష్యంగా, కొండల లాంటి ప్రదేశాలను అక్రమార్కులు మట్టి దందాకు అడ్డగా మార్చుకున్నారు. భారీ యంత్రాలతో మట్టిని తోడుతూ వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో ఏళ్ల తరబడి తవ్వకాలు జరుపుతూ మట్టితోడే ప్రదేశానికి తమ వాహనాలు వెళ్లేందుకు ఏకంగా రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. మైనింగ్‌ని తలపించేలా మట్టి తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం
గోరంత అనుమతికి.. కొండంత తవ్వకాలు..
టిప్పర్ కు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తున్నారు. ఎక్కడో కొంత మట్టి తవ్వేందుకు తీసుకున్న అనుమతి వివరాలు చెబుతూ భారీగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ పనులకు తరలిస్తున్నామంటూ బొంకుతూ ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలించడంతో గ్రామపంచాయతీకి రాయల్టీ రూపంలో వచ్చే నిధులకు గండి కొడుతున్నారు.
బోడు గుట్టను బొందల గుట్టగా మార్చారు..
ములుగు జిల్లా సమీపంలోని బండారుపల్లి గ్రామ శివారులోని బోడు గుట్టపై మట్టి వ్యాపారుల కన్ను పడింది. బోడు గుట్ట రూపురేఖలు మార్చేసేలా తవ్వకాలు చేపట్టారు. ఒకప్పుడు చిన్నపాటి గుట్టలా ఉన్న బోడుగుట్ట ప్రదేశం ఇప్పుడు బొందల గడ్డగా దర్శనమిస్తుంది. బోడుగుట్టపై అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న విషయం దిశ పత్రికలో ప్రచురించడం, బండారుపల్లి గ్రామ ప్రజలు సైతం బోడు గుట్టపై తవ్వకాలు చేపట్టరారంటూ నిరసనకు దిగడంతో మేలుకున్న రెవెన్యూ యంత్రాంగం ఆ ప్రదేశంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి మట్టి తవ్వకాలను నిషేధించింది. దీంతో మట్టి మాఫియా చేసేదేమీ లేక మరోచోటికి మకాం మార్చి తవ్వకాలు చేపడుతున్నారు.
జంగాలపల్లి ఎర్ర గట్టమ్మ వద్ద మరీ ఘోరం..
జంగాలపల్లి గ్రామ శివారులోని ఎర్రగట్టమ్మ వద్ద 2020 లో జాతీయ రహదారి విస్తరణ కోసం మట్టిని తోడడానికి అప్పటి కాంట్రాక్టర్ అనుమతులు తీసుకుని మట్టిని తరలించారు. అదే ప్రదేశం పై కన్నేసిన ఇంచర్ల గ్రామానికి చెందిన మట్టి ముఠా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలకు తెగపడ్డారు. గతంలో జరిగిన తవ్వకాల పేరు చెబుతూ అదే ప్రదేశంలోని మట్టిని చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేసి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
ఎర్ర గట్టమ్మ వద్ద ఒకసారి శాటిలైట్ ఇమేజ్ ను పరిశీలిస్తే ఈ విషయం కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. 2021 డిసెంబర్లో శాటిలైట్ ఇమేజ్ లో రహదారి నిర్మించే కాంట్రాక్టర్ దాదాపు 5 ఎకరాల మేర మట్టిని వాడుకోగా, అదే స్థలంలో మట్టి మాఫియా 2022 అక్టోబర్‌లోపు దాదాపు పది ఎకరాలకు పైగా మట్టిని తరలించారు. దీంతోములుగులో మట్టి మాఫియా ఏ మేరకు పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు
ములుగు జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. మైనింగ్ శాఖలో సిబ్బంది కొరతను ఆసరాగా చేసుకొని అక్రమంగా మట్టిని తరలించే వారిపై దృష్టి సారించాం. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.-మైనింగ్ ఏడీ రామాచారి