దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే మహేశ్ బతికేవాడు: శ్రీధర్ బాబు

by S Gopi |   ( Updated:2022-12-25 13:21:13.0  )
దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే మహేశ్ బతికేవాడు: శ్రీధర్ బాబు
X

దిశ, మహముత్తారాం: పోలీస్ ఈవెంట్స్ లో పాల్గొని అస్వస్థతకు గురై మృతిచెందిన లింగమల్ల మహేష్ మృతికి నిరసనగా కాంగ్రెస్, బీఎస్పీతోపాటు ప్రజాసంఘాలు మండల కేంద్రంలో మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతుగా మంథని ఎమ్మెల్యే సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత యువకుడు మహేష్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, వారి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఈవెంట్స్ జరిగే ప్రాంతంలో కనీసం వైద్యులు లేరని, పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అక్కడే వైద్యులు ఉండి ఉంటే వెంటనే ప్రథమ చికిత్స అందిస్తే మహేష్ బతికేవాడని అన్నారు.

అదేకాకుండా ఈవెంట్స్ జరిగే ప్రాంతం నుండి ఉస్మానియా ఆసుపత్రి చాలా దూరంగా ఉన్నా, అందుబాటులో ఎన్నో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నప్పటికి వాటిలో చూపించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి యువకుడి మృతికి కరణమయ్యారని ఆరోపించారు. ఇప్పటికే ఈవెంట్ లో పాల్గొని మరో ఇద్దరు యువకులు మృతిచెందారని, కరీంనగర్ లో మహిళ అభ్యర్థికి కాలు విరిగిందని అన్నారు. ప్రభుత్వం 8 సంవత్సరాల తర్వాత ఉద్యోగ ప్రకటన ఇచ్చి అభ్యర్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి సంవత్సరం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని తాము ఎన్ని మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రకటించడం లేదని అన్నారు. మహేష్ కుటుంబానికి పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో డీజీపీని కలిసి మహేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. అనంతరం మహేష్ అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శారదా దుర్గయ్య, బీఎస్పీ నాయకులు దాసరి హన్మయ్య, గొట్టే రాజు, దుడేపాక సుమన్, కాంగ్రెస్ నాయకులు పక్కల సడవలి, వెంకట్ రెడ్డి, పక్కల రాజాబాపు, రాజమల్లు, యువజన నాయకుడు బోడ బాలాజీ నాయక్ తోపాటు పలువురు యువకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story