ఎమ్మెల్యే నరేందర్‌ ఓ కబ్జాకోరు.. మావోయిస్టు పెద్దపల్లి డివిజన్‌ కార్యదర్శి వెంకటేశ్‌ ప్రకటన

by Javid Pasha |
ఎమ్మెల్యే నరేందర్‌ ఓ కబ్జాకోరు.. మావోయిస్టు పెద్దపల్లి డివిజన్‌ కార్యదర్శి వెంకటేశ్‌ ప్రకటన
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఓ కబ్జాకోరు అని జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి డివిజన్‌ మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. కొందరు దోపిడీదారులు దేశంలోని పరిశ్రమలను నష్టాల సాకు చూపి అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఆ కోవలోనే వరంగల్‌లోని ఆజంజాహి మిల్లును మూసేసి ఆ భూములను అమ్ముకున్నారని తెలిపారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మాంగల్య షాపింగ్‌ మాల్‌, నమశ్శివాయ మరికొంత మంది అనుచరులతో కలిసి బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకుని కబ్జా చేశాడని పేర్కొన్నారు.

నాలుగేళ్లుగా నరేందర్‌ నగరంలో భూమాఫియాకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఆ పత్రాలతో బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో లోన్‌ తీసుకుని దర్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు చెందాల్సిన సొమ్ముతో రాజ్యమేలుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పాలనలో లీడర్లు సామాన్య ప్రజల భూములను కబ్జా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆజంజాహి మిల్లు స్థలాలను కార్మికులకే అప్పగించాలని ఆ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మిల్లు భూములను కార్మికులే రక్షించుకోవాలని సూచించారు. అవసరమైతే పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story