అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మామునూరు : మంత్రి కొండా సురేఖ

by Kalyani |
అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మామునూరు : మంత్రి కొండా సురేఖ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఓరుగ‌ల్లు ప్ర‌జ‌ల విమానాశ్ర‌యం క‌ల త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతోంద‌ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ స్ప‌ష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా క‌ల‌లు కంటున్నా సాకారానికి నోచుకోలేని అన్నారు. అయితే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక చొర‌వ‌తో విమ‌నాశ్ర‌యం ఏర్పాటుకు మార్గం సుగ‌మ‌మైంద‌ని అన్నారు. మామునూరులో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ప్ర‌యాణికుల సేవ‌ల‌తో పాటు కార్గో సేవ‌ల‌ను సైతం అందించేందుకు ప్ర‌ణాళిక‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. వ‌రంగ‌ల్‌ను రాష్ట్ర రెండో రాజ‌ధానిగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్య‌ంగా సీఎం రేవంత్ రెడ్డి ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పక్కనే ఉన్నందున ఎయిర్ పోర్ట్ సర్వీసులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతి లో దూసుకుపోతుంద‌న్నారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయ‌ని గుర్తు చేశారు. గురువారం కొండా సురేఖ, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలిసి మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూ సేకరణ నిమిత్తం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్థుల‌తో మంత్రి సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావలసిన 253 ఎకరాల భూసేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ వస్తే స్థానిక ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడతాయో సోదాహరణంగా వివరించి, వారిని ఒప్పించారు. ఎయిర్ పోర్ట్ కు భూములు అప్పగిస్తున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

భూమి కోల్పోతున్న 233 మంది రైతులు, ఫ్లాట్ ల యజమానులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు ఇతర భూమి కేటాయించి, వారు కోరిన విధంగా మౌలిక సదుపాయాలైన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర సదుపాయాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భూములు అప్పగించేందుకు అంగీకరించిన రైతులకు మంత్రి సురేఖ‌ ధన్యవాదాలు తెలిపారు. రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించేందుకు కావలసిన నిధులు, రైతులకు కేటాయించే స్థలాలను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిహారం చెల్లింపుకు సమగ్ర నివేదికను రూపొందించి మంజూరి నిమిత్తం ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి సురేఖ ఆదేశించారు.

హైద‌రాబాద్‌కు ధీటుగా వ‌రంగ‌ల్ అభివృద్ధి…

అనంత‌రం మంత్రి సురేఖ విలేక‌రుల‌తో మాట్లాడారు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉందని మంత్రి సురేఖ పునరుద్ఘాటించారు. వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప తో పాటు, భద్రకాళి 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, కాకతీయ కట్టడాలు, మెగా టెక్స్టైల్ పార్క్ అవసరాలు, భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మామునూరు ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ విమానాశ్రయం గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రయాణికుల సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించే దిశగా ఎయిర్ పోర్టు అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి 150 కి.మీ ల దూరంలో మరో వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటు నిబంధనల మేరకు కుదరదని చెప్పినా, సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని, జిఎంఆర్ సంస్థ ను ఒప్పించి మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed