Coach Factory : చుక్. చుక్..కోచ్‌.. కోచ్ ఫ్యాక్ట‌రీతో కాజీపేట‌కు మ‌హర్ద‌శ..

by Sumithra |
Coach Factory : చుక్. చుక్..కోచ్‌.. కోచ్ ఫ్యాక్ట‌రీతో కాజీపేట‌కు మ‌హర్ద‌శ..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ద‌శాబ్దాల వ‌రంగ‌ల్ వాసుల క‌ల నెర‌వేరింది. ఉత్త‌ర‌ - ద‌క్షిణ భార‌తదేశాల‌ను క‌లుపుతూ వార‌ధిగా ఉంటూ వ‌స్తున్న కాజీపేట జంక్ష‌న్‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ( Coach Factory ) ఏర్పాటు చేయాల‌నే జిల్లా వాసుల క‌ల నేటికి సాకార‌మైంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్వ‌యంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వ్యాగ‌న్ త‌యారీ యూనిట్‌ను కోచ్ ఫ్యాక్ట‌రీ ప‌రిశ్ర‌మ‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వ్యాగ‌న్ షెడ్ ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకోగా తాజాగా కోచ్ ఫ్యాక్ట‌రీగా అనౌన్స్‌మెంట్ రావ‌డంతో జిల్లావాసులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాజీపేట జంక్ష‌న్‌లో ప‌నిచేస్తూ ఇక్క‌డే ఏర్పాటైన రైల్వే కుటుంబాల స‌భ్యులు.. ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని ఆశ‌ప‌డుతున్నాయి. దాదాపు 40 ఏళ్ల‌కు పైగా కోచ్ ఫ్యాక్ట‌రీ సాధ‌నోద్య‌మాలు కొన‌సాగుతూ వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కానుండ‌టంతో కాజీపేట జంక్ష‌న్‌కు ( Kazipet Junction ) మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ముఖ్యంగా కాజీపేట ప‌ట్ట‌ణకేంద్రంగా నివాస‌ముంటున్న రైల్వే కుటుంబాల‌కు, స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని, కాజీపేట ప‌ట్ట‌ణ అభివృద్ధికి అవ‌కాశం ఏర్ప‌డుతోంద‌నే ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది.

అనేక అవాంత‌రాలు దాటుకుని..

55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తూ వ‌చ్చారు. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు పై హమీ ఇచ్చిన కేంద్రం, 2023 లో వ్యాగన్‌ తయారీ పరిశ్రమను ప్రకటించింది. దీని పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. వేలాది మందికి ఉపాధి కల్పించే కోచ్‌ ఫ్యాక్టరీ రాకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అనేకానేక ఉద్యమాలు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.383 కోట్లతో అంచనాతో కాజీపేటకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వర్క్ షాప్ మంజూరు చేసింది. ఈ మేరకు పీవోహెచ్‌ను 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రూ.521 కోట్లతో వ్యాగన్ తయారీ వర్క్ షాప్ గా అప్ గ్రేడ్ చేసింది. 2023 జూలై 8న వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 160 ఎకరాల్లో వ్యాగ‌న్ ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పుతున్నారు. వ్యాగన్ తయారీ నిర్మాణ బాధ్యతలను రైల్వే నిగమ్ లిమిటెడ్​కు ( Railway Nigam Ltd ) అప్పగించారు. ఈ ప‌నులు వేగంగా కొన‌సాగుతూ చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న స‌మ‌యంలో కోచ్ ఫ్యాక్ట‌రీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

మొద‌లు కానున్న స‌ర్వే..

రైల్వే వ్యాగ‌న్ షెడ్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు వ్యాగ‌న్‌కు కేటాయించిన స్థ‌లంలోనే కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు అధికారులు స‌ర్వే చేప‌ట్టునున్నారు. కోచ్ ఫ్యాక్ట‌రీ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్‌లో గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లతో పాటు రైల్వే కోచ్‌ల తయారీకూడా జ‌ర‌గ‌నుంది. ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎంయూలు) కూడా త‌యారీ కానున్నాయి. ఈ యూనిట్‌ను ఏడాదికి 600 కోచ్‌ల ఉత్పత్తి సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉండేలా రైల్వే అధికారులు ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్నారు. కోచ్ ఫ్యాక్ట‌రీతో ప్ర‌త్య‌క్షంగా సుమారు 3,000 మందికి ఉద్యోగ అవ‌కాశాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed