పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం: చాడ వెంకటరెడ్డి

by Vinod kumar |   ( Updated:2022-11-26 14:08:19.0  )
పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం: చాడ వెంకటరెడ్డి
X

దిశ, భీమదేవరపల్లి/ఎల్కతుర్తి: పేదలకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామ శివారులో సర్వే నెంబరు 556 లో గల 51 ఎకరం నాలుగు గుంటల భూమిలో భూ పోరాటం గత 9 రోజులుగా కొనసాగుతున్నది. శనివారం సీపీఐ మండల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కురి రాములు, కర్రే లక్ష్మణ్, అధ్యక్షతన భూ పోరాట సంఘీభావ సదస్సును నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఎప్పుడూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడుతూ వస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేడు గుడిసె వాసులంతా ఉద్యమించాలని వారికి పిలుపునిచ్చారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్ల జాగాలు ఇవ్వాలని జీవో నెంబర్ 58, 59 ల ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే చూస్తూ ఊరుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు తప్పవని హెచ్చరించారు. బీజేపీని నిలువరించడానికి మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని.. మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాద బీజేపీ మనుషుల మధ్య కులం పేరుతో, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి.. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తుందని, బీజేపీ ని బొంద పెట్టడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించి పేదలకు ఇళ్ల పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇల్లు లేని శ్రమజీవులకు ఇళ్ల జాగాలు దక్కేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు అని, కష్టజీవులకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది ఎర్రజెండా సిపిఐ మాత్రమే అని, అ జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత పేద ప్రజల అందరి పైన ఉందని ప్రజలను కోరారు. 2014 నుండి 2022 దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల జాగలు ఇస్తుందని వేచి చూశామని కానీ ఇప్పుడు అట్లాంటి ఓపిక తమకు లేదని ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డ ఎర్రజెండాలు పాతి తామే పేద ప్రజలందరికీ ఇళ్ల జాగలు పంచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఇప్పటికైనా అర్హత కలిగిన నిరుపేదలకు తమ హామీలు ఇచ్చిన విధంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేద ప్రజలకు ఇవ్వాలని ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వానికి భూమి కనబడకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి తామే నివేదిక అందిస్తామని ఇప్పటికైనా సమీక్ష సమావేశం నిర్వహించి పేదలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదరి శ్రీనివాస్, బికేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు మోత లింగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మధ్యల ఎల్లేష్, మహిళా సమాఖ్య హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంచాల రమాదేవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల ప్రసన్న కుమార్, భాష బోయిన సంతోష్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మర్రి శ్రీనివాస్, కామర వెంకటరమణ, నిమ్మల మనోహర్, మండల నాయకులు నిమ్మల మనోహర్ తండముండయ్య, రాజ్ కుమార్, సుమారుగా 1,500 మంది గుడిసె వాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed