బ్రాందీకి బానిస కేసీఆర్ : బండి సంజయ్ ఫైర్

by Sridhar Babu |
బ్రాందీకి బానిస కేసీఆర్ :  బండి సంజయ్ ఫైర్
X

దిశ, కాటారం : కేసీఆర్ పాలన స్కాం ల పర్వంగా మారిందని, జనం సొమ్ము దోచుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారని, ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకుంటూ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం కాటారంలో బీజేపీ బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో లక్షల కోట్లు దోచుకున్నారని, తాటిచెర్లలోని ఓపెన్ కాస్ట్ ఏఎంఆర్ కంపెనీకి అప్పజెప్పి ప్రైవేటీకరణ చేసి ప్రజల సొమ్ము కోట్లు కొల్లగొట్టాడని తీవ్రంగా ఆరోపించారు. అవినీతికి బీఆర్ఎస్ ఆనకొండగా మారిందని, కాలేశ్వరంలో ఇసుక దోచుకున్నారని, ఒకే నెంబర్ పై ఎన్నో వాహనాలు ఒకే వే బిల్లు, ఒకటే స్టిక్కర్ ఉంటుంది డ్రైవర్లు మాత్రం మారతారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్లకు తరలిస్తారని చెప్పి కాలేశ్వరం ఇసుక దోచుకున్నారని విమర్శించారు. బీజేపీకి పాదయాత్రలు కొత్త కాదని, గతంలో చిన్నమనేని విద్యాసాగర్ సస్యశ్యామల యాత్ర నిర్వహించినట్లు, నక్సలైట్లు బెదిరించినా , పోలీసులు ప్రభుత్వం సహకరించకున్నా ప్రజలు కావాలన్నందుకే యాత్ర చేపట్టి గోదావరి మాత విగ్రహాన్ని పెట్టినట్లు గుర్తు చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికి లాభం?

లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికీ ఉపయోగం లేదని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అల్లుడు భూపాల పెళ్లి, వరంగల్, కరీంనగర్ వెళ్లి ఇక్కడ కాలేశ్వరం ప్రాజెక్టు నీరు ముద్దాడిన తర్వాతనే అక్కడికి వెళ్తున్నాయని చెప్పి ప్రజలను మభ్య పెట్టాడని, ఈ ప్రాంతానికి కాలేశ్వరం నీరు ఎక్కడికొచ్చిందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికి లాభమని ? 30 వేల కోట్లు, లక్ష పదివేల కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో 40,000 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఏ ఒక్కరికి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వలేదని, వరదలతో, బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతాంగంకి ఎలాంటి పరిహారం చెల్లించలేదని, పొలాలు, ఇల్లు పోతే ఒక్క పైసా పరిహారం ఇవ్వకుండా ప్రజలకు చిప్ప చేతికిచ్చిన మూర్ఖుడు కేసీఆర్ అని ఘాటుగా ఆరోపించారు.

సింగరేణి ప్రైవేట్ పరమంటూ దుష్ప్రచారం

సింగరేణి సంస్థ లో 51 శాతం రాష్ట్ర వాటా, కేంద్రం వాటా 49 శాతం ఉండగా ఎలా ప్రైవేటీకరణ చేస్తారని, ప్రైవేటీకరణ చేస్తే గల్లా పట్టుకొని ప్రశ్నిస్తామని సంజయ్ అన్నారు. సీఆర్ సింగరేణిని ఉద్ధరిస్తానంటూ ఓపెన్ కాస్ట్ గనులు తీసేస్తున్నాడని, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ప్రైవేటీకరణ చేయడం 20 వేల కోట్ల పెద్ద స్కామని , 60 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని, సింగరేణి బొగ్గు డబ్బులు వాడుకున్నాడని తెలిపారు. సింగరేణి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నదంటే ఆ పైసలన్నీ కేసీఆర్ , కేసీఆర్ కుటుంబం ఏటీఎం లాగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు.

సమస్యల పైన బీజేపీ మాత్రమే ఉద్యమించిందని, సమస్యలు తెలుసుకునేందుకు మంథని నియోజకవర్గంలో చందుపట్ల సునీల్ రెడ్డి పాదయాత్ర నిర్వహించినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 120 రోజులు , 56 నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామ యాత్ర చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పెళ్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ చందుపట్ల రాంరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి, దుర్గం తిరుపతి, అండం వసంత రెడ్డి, బొమ్మన భాస్కర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, దోమల సమ్మయ్య, గంట అంకయ్య, వివిధ మండల శాఖల అధ్యక్షులు సంపత్ కుమార్ , శ్రీమనారాయణ, మల్కా మోహన్ రావు, మంథని, భూపాలపల్లి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story