ముందుకు సాగని పనులు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

by Disha Web Desk 23 |
ముందుకు సాగని పనులు..  ఇబ్బందులు పడుతున్న ప్రజలు..
X

దిశ, మరిపెడ: వర్షాకాలంలో వాహనదారులు, ప్రజలు సరైన రోడ్లు,హై లెవెల్, లో లెవెల్ బ్రిడ్జి ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు లేక ప్రజా అవసరాల దృష్ట్యా కావొచ్చు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రోడ్డు మార్గాన సురక్షితంగా, సునాయాసంగా వెళ్లాలని ఆలోచనలతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తుంది. కానీ కొన్ని ప్రదేశాలలో గుత్తేదారుల నిర్లక్ష్యం తో పనులు పూర్తిస్థాయిలో పూర్తి కావడం లేదు అన్నా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. శంకుస్థాపన చేసిన రోజు నుండి నెలలుకు నెలలు గడిచిన కొన్నిచోట్లలో బీటీ రోడ్డు నిర్మించే దారిని చదనం చేసి వదిలేశారు. మరికొన్నిచోట్ల కంకర పోసి వదిలేశారు. గత అసెంబ్లీ ఎన్నికల హడాహుడి నేపథ్యంలో శిలాఫలకాలు లేకుండానే పనులు ప్రారంభించారు. ఈ బీటీ రోడ్ ల నిర్మాణం ఎప్పుడు ఎప్పుడు పూర్తవుతుందా అంటూ ప్రజలు,వాహనదారులు, రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా పశువులు సైతం నడవలేని దుస్థితి ఏర్పడింది.

ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

చిన్నగూడూరు దాశరథి విగ్రహం నుండి జయ్యారం గ్రామం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వరకు ఐదు కిలోమీటర్లకు ఆర్డీఎఫ్ నిధుల నుండి నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు మట్టి వర్క్ మాత్రమే పూర్తయింది.

కురవి మండలం కందికొండ శివారు ఆర్ అండ్ బి రహదారి నుండి అయ్యగారి పల్లి ఆర్ అండ్ బి రహదారి వరకు గత సంవత్సరం అక్టోబర్ లో మూడు కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు.నేటికీ పని పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు

కురవి మండలంలోని రాయిని పట్నం వద్ద వంతెన నిర్మాణం కోసం రెండు కోట్ల అంచనా వ్యయంతో గత సంవత్సరం జులైలో పనులు ప్రారంభించిన పూర్తిస్థాయిలో పూర్తికాలేదు ప్రస్తుతం పని నడుస్తూనే ఉంది.

మరిపెడ మండలంలోని తాళ్ల ఊకల్ శివారు నుంచి వెంకంపాడు వరకు లెవెల్ కంకర దర్శనమిస్తుండగా ఇదే మండలంలో రంగాపురం నుండి ఆర్లగడ్డ తండా వరకు కంకరతో అదే పరిస్థితి ప్రజలు నడవాలన్న, వాహనదారులు వెళ్లాలన్న ఇబ్బందులకు గురవుతున్నారు.

తక్కువ సమయంలో చేరుకోవాలి అంటే ఈ దారి గుండానే వెళ్లాలి : కొత్త శేఖర్, చిన్నగూడూరు

చిన్న గూడూరు మండల కేంద్రానికి జయ్యారం,మంగోలి గూడెం,మన్నెగూడెం గ్రామాల ప్రజలు వారి అవసరార్థం తక్కువ సమయంలో చేరుకోవాలి అంటే ఈ దారి గుండానే వెళ్లాలి వచ్చేది. వర్షాకాలం కాబట్టి ఈ బీటీ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని ఇది పూర్తయితే అందరికీ ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

ఓ కాంట్రాక్టర్ వివరణ..

నియోజకవర్గంలో ఉన్న కాంట్రాక్టర్ల బాధంతా ఒక్కటే కోట్ల రూపాయలు వెచ్చించి పనులు మొదలుపెట్టాం. ఇప్పటివరకు చేసిన పనికే బిల్లులు రాలేదు. అప్పులు తెచ్చిన దగ్గర వడ్డీ ల భారం పెరుగుతుంది. కొంతలో కొంత ఉపశమనం కలిగాక వీలైనంత త్వరలోనే మిగతా పనులు పూర్తి చేస్తాం.

Next Story

Most Viewed