ఇండియా కూటమి ‘వన్ ఈయర్.. వన్ పీఎం’ కుట్ర : ప్రధాని మోడీ

by Hajipasha |
ఇండియా కూటమి ‘వన్ ఈయర్.. వన్ పీఎం’ కుట్ర : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ‘వన్ ఈయర్.. వన్ పీఎం’ ఫార్ములా వైపు చూస్తోందని, దాని వల్ల దేశానికి నష్టం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఒక్కో సంవత్సరం ఒక్కో నాయకుడు ప్రధానమంత్రి అయితే దేశం బలోపేతం అయ్యే అవకాశమే ఉండదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు అధికారంపైనే ధ్యాస కాబట్టి.. వాళ్లు దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు వెనుకాడబోరని ప్రధాని విమర్శించారు. అటువంటి ప్రతిపక్ష కూటమికి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలా ? వద్దా ? అనేది ప్రజలే తేల్చుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు 400 లోక్‌సభ సీట్లను గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభలో కనీస మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో పోటీ చేయలేని తీరుగా బలహీనపడిపోయిందని ప్రధాని విమర్శించారు. కూటమిలోని ఏ ఒక్క పార్టీకి కూడా అంతగా ప్రజాదరణ లేదన్నారు. దేశానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి.. సుస్థిర ప్రభుత్వాన్ని, బలమైన నాయకత్వాన్ని అందించే బీజేపీకి అండగా నిలవాలని ప్రజలను కోరారు.

నమ్మకం విశ్వాసంగా.. విశ్వాసం గ్యారంటీగా మారింది

2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిపోయిందని, 2024 సంవత్సరానికి వచ్చేసరికి ఆ విశ్వాసం కాస్తా గ్యారంటీగా మారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. పదేళ్ల పాలనా అనుభవంతో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందని చెప్పారు. గ్యారెంటీలు ఇవ్వాలంటే పెద్ద తపస్సు చేయాలని, మాట్లాడిన ప్రతీ మాట గ్యారెంటీగా ఉండాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోడీ కుండబద్ధలు కొట్టారు. అవినీతిలో పతకాలు ఇస్తే తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కారుకు గోల్డ్‌ మెడల్‌, అంతకు ముందున్న బీఆర్ఎస్‌ సర్కారుకు సిల్వర్‌ మెడల్‌ వస్తాయన్నారు. ఇక ఏపీ ప్రజల్లోనూ మార్పు మూడ్‌ కనిపిస్తోందని ప్రధాని అన్నారు. చిలకలూరిపేట సభలో ఆ విషయాన్ని తాను స్పష్టంగా చూడగలిగానని తెలిపారు. ‘‘పొత్తులు అనేవి ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయరాదు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది నా అభిమతం’’ అని మోడీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story