త‌గ్గేదేలే..త‌ర‌లిస్తాం..ప‌ట్టుబ‌డుతున్నా మార‌ని వైఖ‌రి

by Aamani |
త‌గ్గేదేలే..త‌ర‌లిస్తాం..ప‌ట్టుబ‌డుతున్నా మార‌ని వైఖ‌రి
X

దిశ‌, ఏటూరునాగారం: మూగ‌జీవాల‌ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పశువులను పాశ‌వికంగా వాహ‌నాల్లో కబేళాలకు త‌ర‌లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు.. నిత్యం అక్రమంగా ప‌శువుల‌ను క‌బేళాల‌కు త‌ర‌లిస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డుతున్నా వారి వైఖ‌రి మాత్రం మార‌డం లేదు. ఛత్తీస్‌గఢ్, చర్ల స‌రిహ‌ద్దు ప్రాంతాలను స్థావ‌రంగా చేసుకుని ప్రతిరోజూ రాత్రి స‌మ‌యంలో కంటైన‌ర్‌, డీసీఏం, బొలెరో, టాటాఏస్ వాహ‌నాల్లో వెంక‌టాపూరం, వాజేడు, ఏటూరునాగారం, ప‌స్రా, ములుగు జిల్లా మీదుగా ప‌శువుల‌ను రవాణా చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని క‌బేళాల‌కు త‌ర‌లిస్తూ అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.

కబేళాల‌కు త‌ర‌లింపు..

ప‌శు ర‌వాణా చ‌ట్టం 1978 ఉల్లంఘిస్తూ ప‌శువులను లారీ కంటైన‌ర్, డీసీఏం, బొలెరో వంటి వాహ‌నాల్లో ప‌రిమితికి మించి త‌ర‌లిస్తున్నారు. రవాణా స‌మ‌యంలో వాహ‌నాల్లోనే శ్వాస అంద‌క పశువులు మృతి చెందుతున్నాయి. ధ‌నార్జనే ధ్యేయంగా ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండా పశువుల అక్రమ రవాణా సాగిస్తున్నారు.

ప‌ట్టుబ‌డుతున్న వాహనాలు..

అక్రమంగా వాహ‌నాల్లో ప‌శువుల‌ను త‌ర‌లిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు కోకొల్లలు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇందుకు సాక్ష్యాలుగా గ‌డిచిన నెల రోజుల వ్యవ‌ధిలో జిల్లా ప‌రిధిలో ప‌లుమార్లు ప‌శువుల‌ను వాహ‌నాల్లో త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

-అక్టోబ‌ర్‌02న ములుగు జిల్లా ప‌స్రా పోలీస్ స్టేష‌న్ పరిధిలో రెండు వాహ‌నాల్లో గోవుల‌ను త‌ర‌లిస్తుండ‌గా ప‌స్రా పోలీసులు ప‌ట్టుకుని గోశాల‌కు త‌ర‌లించారు.

-అక్టోబ‌ర్ 06న వాజేడు మండ‌లం జ‌గ‌న్నాథపురం క్రాస్ వ‌ద్ద బొలెరో వాహ‌నంలో ప‌శువుల‌ను త‌ర‌లిస్తుండ‌గా వాజేడు పోలీసులు ప‌ట్టుకున్నారు.

-అక్టోబ‌ర్‌16న ములుగు డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వ‌ద్ద ప‌శువుల‌ను అశోక్ లీ ల్యాండ్ వాహ‌నంలో త‌ర‌లిస్తుండ‌గా ములుగు పోలీసులు ప‌ట్టుకున్నారు.

–అక్టోబ‌ర్‌17న ములుగు జంగాల‌ప‌ల్లి గ్రామం వ‌ద్ద పశువుల వాహ‌నాన్ని ప‌ట్టుకున్నారు.

–అక్టోబ‌ర్‌19న ములుగు మ‌ల్లంప‌లి హ‌నుమాన్ వే బ్రిడ్జి వంతెన వద్ద ప‌శువుల‌ను త‌ర‌లిస్తున్న వాహ‌నాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు.

–అక్టోబ‌ర్‌19న ఏటూరునాగారం గ్రామ చెక్ పోస్ట్ వ‌ద్ద ప‌శువుల‌ను త‌ర‌లిస్తున్న డీసీఏం, ఎస్కార్ట్‌గా వ‌స్తున్న కారును పోలీసులు ప‌ట్టుకుని సీజ్ చేశారు.

ప్రత్యేక దృష్టిసారించిన పోలీస్ యంత్రాంగం..

ములుగు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ శ‌బ‌రీష్ ఆదేశాల మేర‌కు ఆయా మండ‌లాల పోలీసు అధికారులు అక్రమ ర‌వాణా, అక్రమ వ్యాపారాలు వంటి ప‌లు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. జిల్లా వ్యాప్తంగా ఆయా మండ‌లాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాల ద్వారా 24 గంట‌ల నిత్య పర్యవేక్షణతో అక్రమాల‌కు అడ్డుక‌ట్ట వేసే దిశగా పోలీసులు క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటున్నారు.

అక్రమ రవాణాపై ఫోకస్ : ఏటూరునాగారం ఎస్సై తాజోద్దిన్‌..

జిల్లా ఎస్పీ ఆదేశాల మేర‌కు నిరంత‌రం పోలీసులు, సిబ్బంది అప్రమ‌త్తంగా వ్యవ‌హరిస్తున్నాం. ముఖ్యంగా మూగ‌జీవాల త‌ర‌లింపు, ఇసుక జీరోదందా, పీడీఎస్ రైస్ త‌ర‌లింపు, పేకాట‌, కోడి పందేలుపై ప్రత్యేక దృష్టి సారించాం. నిరంతరం తనిఖీలు చేపడుతున్నాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నాం.

Advertisement

Next Story

Most Viewed